మరోసారి కండువా మారుస్తారా?

టీజీ వెంకటేశ్ భవిష్యత్ రాజకీయాలను అంచనా వేయడంలో దిట్ట. 2019 ఎన్నికలకు ముందు జనసేనతో పొత్తు ఉండాలని బలంగా కోరుకున్నారు

Update: 2022-01-14 02:40 GMT

టీజీ వెంకటేష్ సీనియర్ నేత. ఆయన ఎన్నో డక్కామొక్కీలు తిన్న నేత. ఆయన రాజకీయ జీవితంలో మూడు పార్టీలు మారారు. భవిష్యత్ రాజకీయాలను అంచనా వేయడంలో దిట్ట. 2019 ఎన్నికలకు ముందు ఆయన జనసేనతో పొత్తు ఉండాలని బలంగా కోరుకున్నారు. చంద్రబాబు వద్ద కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. కానీ ఆ ఎన్నికల్లో జరగలేదు. కానీ ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు ఖచ్చితంగా ఉంటుందన్న అంచనా వేస్తున్నారు. టీజీ వెంకటేష్ ఈ విషయాన్ని సన్నిహితుల వద్ద కూడా వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

బలమైన నేతగా...
టీజీ వెంకటేశ్ ఆర్యవైశ్య సామాజికవర్గంలో బలమైన నేత. పారిశ్రామికవేత్తగా ఆయన అందరికీ సుపరిచితం. కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం ఉండి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన 2014లో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తన కుమారుడికి కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించుకున్నారు. అయితే గెలిపించుకోలేక పోయారు. కానీ అదే సమయంలో టీడీపీ నుంచి తాను రాజ్యసభ పదవిని పొందగలిగారు.
వచ్చే ఎన్నికలలో....
2019 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీ నుంచి బీజేపీలో చేరిపోయారు. సామూహిక జంప్ లో భాగంగా ఆయన కూడా బీజేపీ లో చేరారు. ఆయన కుమారుడు మాత్రం ఇప్పుడు టీడీపీలో కీలకంగా ఉన్నారు. కర్నూలు టౌన్ నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీజీ భరత్ కే కర్నూలు టిక్కెట్. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఖర్చు పెట్టుకోవాలనుకున్నా, సామాజికపరంగా చూసినా టీజీ భరత్ ను కాదని చంద్రబాబు మరొకరికి అవకాశమిచ్చే పరిస్థితి లేదు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఉంటే ఒకే. అలా కాకుండా జనసేన, టీడీపీ, కమ్యునిస్టు కాంబినేషన్ వర్క్ అవుట్ అయితే మాత్రం టీజీ వెంకటేష్ కు ఇబ్బంది.
ఆ కాంబినేషన్....
ఎన్నికల సమయంలో ఆయన తన కుమారుడి పక్షాన ప్రచారం చేయాలని బలంగా కోరుకుంటున్నారు. కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం మరోసారి పార్టీ మారేందుకు కూడా ఆయన సిద్ధం. అయితే బీజేపీతో టీడీపీ జత కడితే మాత్రం ఆయనకు ఎటువంటి ఇబ్బందులుండవు. టీజీ వెంకటేష్ అంచనాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, కమ్యునిస్టులు మాత్రమే కలుస్తారని చెబుతున్నారట. అదే నిజమైతే ఆయన మరోసారి పార్టీ కండువా మార్చక తప్పదు.


Tags:    

Similar News