వీరభక్తుడి వీరవిహారం...హై కమాండ్ ఏం చేయాలి?

తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా విజయం సాధించాలని ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటారు.

Update: 2022-03-20 04:30 GMT

కొందరు పార్టీలో ఉంటే లాభం. మరికొందరు పార్టీ బయట ఉంటే లాభం. ఈ రెండో కోవకు చెందిన వారే వి.హనుమంతరావు. ఆయన చేసే.. చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడు ప్రజల నుంచి ప్రజాప్రతినిధిగా ఎంపిక కాని వీహెచ్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అదే ఆయన బలం. పార్టీకి బలహీనత. ఇప్పుడు ఏం కొంప మునిగిందని వీహెచ్ రేవంత్ పై తిరుగుబాటు సమావేశం పెట్టారన్నది పార్టీలో చర్చనీయాంశమైంది.

సీనియర్ బోర్డును మెడలో వేసుకుని...
ప్రజల్లో బలం ఉన్న నాయకుడు తిరగబడితే కొంత అర్థముంటుంది. కానీ వీహెచ్ వల్ల ఏనాడూ పార్టీకి ఉపయోగం లేదు. ఆయన గాంధీ కుటుంబానికి వీర భక్తుడు. అదే ఆయనకు అనేకసార్లు పదవులను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి వరకూ కొంత మౌనంగా ఉన్న వీహెచ్ ఇప్పుడు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీనియర్ బోర్డును మెడలో వేసుకుని పార్టీలో హంగామా చేస్తున్నారు.
పట్టుమని పది ఓట్లు...
నిజానికి వీహెచ్ బలహీనవర్గాల ప్రతినిధిగా చెప్పుకుంటూ తిరుగుతుంటారు. కానీ ఏ ఎన్నికల్లోనూ పట్టుమని పది ఓట్లు పార్టీకి సాధించిపెట్టిన పరిస్థిితి లేదు. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా కాంగ్రెస విజయం సాధించాలని ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటారు. కానీ కాంగ్రెస్ నేతలకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. కాస్త ముందుకు వెళుతున్న పార్టీని వెనక్కు లాగడమే పనిగా పెట్టుకున్నారు.
కోలుకుంటున్న సమయంలో....
అసంతృప్త నేతల సమావేశంతో ఏం ఒరుగుతుంది? ఒకవేళ హైకమాండ్ రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించేసినా మరో వ్యక్తికి పీసీసీ చీఫ్ పదవి అప్పగించాల్సిందే. ఇప్పుడిప్పుడే రేవంత్ కాంగ్రెస్ ను కొంత ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. కేసీఆర్ కు దీటుగా మాట్లాడే వ్యక్తి రేవంత్. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన సీనియర్లు తమకు చెప్పకుండా రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ వేరుకుంపటికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద చివరకు నష్టపోయేది కాంగ్రెస పార్టీయే. అందుకే సీనియర్లు పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని కిందిస్థాయి క్యాడర్ కోరుకుంటోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా పార్టీకి ఉపయోగం లేని నేతలను దూరం పెడితేనే బాగుంటుంది.


Tags:    

Similar News