YSRCP : ఫ్యాన్ కింద సేదతీరడమే మంచిదా.. లీడర్లలో ఆలోచన

నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ వైపు చూసే నేతల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయన్నఅంచనాలు వినిపిస్తున్నాయి

Update: 2026-03-26 08:56 GMT

నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ వైపు చూసే నేతల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయన్నఅంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న 175 నియోజకవర్గాల నుంచి 263కు, ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరగనున్నాయి. అంటే ప్రస్తుతమున్న నేతలకు తోడు అదనంగా మరో వంద మందికి పైగా నేతలకు వచ్చే ఎన్నికలలో టిక్కెట్లు దక్కననున్నాయి. అదే వైసీపీలో ఉంటే అడ్వాంటేజీ ఉంటుందన్న భావన నేతల్లో కలుగుతుంది. కూటమి కంటే ఫ్యాన్ పార్టీలో ఉంటేనే బెటర్ అని ఎక్కువ మంది సీట్లు ఆశిస్తున్న నేతలు భావిస్తున్నారు.

కూటమిలో ఉంటే టెన్షనే...
కూటమిలో ఉండి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తే సీటు వస్తుందో లేదో చివరకు వరకూ టెన్షన్ తప్పదు. ఎందుకంటే కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలుండటంతో ఎవరికి ఏ స్థానం కేటాయిస్తారన్నది ఎవరికీ అంతుచిక్కదు. చివరి నిమిషంలో కూటమిలో ఏ పార్టీ అయినా పట్టుబడితే తాము ఆశించిన సీటు చేజారి పోయే అవకాశముంది. మొన్నటి ఎన్నికల్లోనూ అనేక మంది సీనియర్ నేతలకు, ఆశావహులకు టిక్కెట్లు దక్కకపోవడానికి కూటమిలో పొత్తుల వల్లనేనని చాలామంది రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలో కష్టపడ్డ తమకు గుర్తింపు రావాలంటే వైసీపీ అయితే బెటర్ అని భావించే అవకాశముంది.
ఫ్యాన్ పార్టీ అయితే...
అదే వైసీపీలో చేరితే తాము గట్టిగా ప్రయత్నిస్తే టిక్కెట్ దక్కడం సులువవుతుందని ఎక్కువ మంది నేతలు నమ్ముతున్నారు. 263 శాసనసభ, 38 పార్లమెంటు నియోజకవర్గాల్లో పాత నేతలు కొందరు వెళ్లినా కొత్త వారికి అవకాశాలు వైసీపీలోనే దక్కుతాయని అప్ కమింగ్ లీడర్లు భావిస్తున్నారు. వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తున్నందున పోటీ తక్కువగా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే ఇప్పుడు రానున్న కాలంలో ఎక్కువ మంది నేతలు వైసీపీ వైపు వచ్చే అవకాశముందన్న అంచనాలు కూడా వినపడుతున్నాయి. టిక్కెట్ దక్కాలంటే ఫ్యాన్ కంటే పదిలం మరేది ఉండదన్న భావన ఎక్కువ మందిలో కలుగుతుంది. మరి రానున్న కాలంలో వైసీపీలో చేరికలు ఏ మాత్రం ఉంటాయన్నది చూడాలి.


Tags:    

Similar News