Bus Accident : నిద్రలోనే పోయిన ప్రాణాలు.... ప్రమాదానికి నిర్లక్ష్యం డ్రైవింగే కారణమా?

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2026-03-26 03:23 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు మంటల్లో దగ్దం కావడంతో పదమూడు మంది సజీవ దహనమయ్యారు. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా, పదమూడు మంది సజీవదహనం అయ్యారు. చాలా మంది ఈ ప్రమాదంలో గాయాలపాలయ్యారు. దాదాపు ఇరవై మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. అతి వేగంతో పాటు.. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది.

జగిత్యాల నుంచి వింజమూరుకు...
ట్రావెల్ బస్సులో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ మరణించినట్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రమాదంతో బస్సు, టిప్పర్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి. గురువారం ఉదయం ఐదు గంటల మధ్య ఈ విషాదం జరిగింది. ఘటనాస్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వేగంగా కంకర లోడుతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. తెల్లవారు జాము కావడంతో బస్సులో అందరూ నిద్రలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో తమ గమ్యస్థానాలకు వెళ్లేలోపు సజీవ దహనమయ్యారు.
ఎక్కువ మంది కనిగిరి ప్రాంతం వారే...
మృతుల్లో ఎక్కువ మంది కనిగిరి, సీఎస్ పురం, పామూరు ప్రాంతాలకు చెందిన వారని చెబుతున్నారు. రేపు శ్రీరామనవమి పండగ కావడంతో ఎక్కువ మంది సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు. మరికొందరు శుభకార్యాలకు వెళ్లేవారు కూడా ఉన్నారు. స్లీపర్ సీట్లో నిద్రిస్తున్నవారంతా చనిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కొందరు కిటికీలు బద్దలు కొట్టి బయటకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతిచెందినట్లు తెలిసింది. బస్సు ముందు భాగంలో ఉన్న సుమారు పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటన స్థలికి అధికారులు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.


Tags:    

Similar News