Azharuddin : మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం
మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం పొంచి ఉంది
మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం ముప్పు పొంచి ఉంది. ఆయన మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు గడుస్తుండటంతో మంత్రి పదవి నుంచి తప్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా హడావిడిగా అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసకున్నారు. అయితే వచ్చే నెల 30వ తేదీతో ఆయన మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు ముగుస్తుంది. ఎటువంటి పదవి లేకుండా ఆరు నెలల వరకూ మంత్రి పదవిలో ఉండవచ్చు. ఆరు నెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎంపిక కావాల్సి ఉంటుంది. కానీ ఇంకా ముప్ఫయి రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎమ్మెల్సీ పదవిని భర్తీ చేసే అవకాశం కనిపించడం లేదు.
కొన్ని ఆప్షన్లు...
అయితే ప్రభుత్వం వద్ద కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. అజారుద్దీన్ చేత ఈలోపు మంత్రి పదవికి రాజీనామా చేయించడం. తర్వాత మే నెల 16వ తేదీన తిరగి కేబినెట్ లోకి తీసుకుంటే మరో ఆరు నెలల సమయం చిక్కుతుంది. అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవికి గవర్నర్ ఆమోదం తెలుపుతారా? లేదా? అన్నది మరో ప్రశ్న. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకలను సాకుగా చూపి గతంలో సుప్రీంకోర్టు పదవి నుంచి తప్పుకోవాలని చెప్పడంతో గవర్నర్ అభ్యంతరం చెప్పే అవకాశాలు కూడా కొట్టిపారేయలేకపోతున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కాలంటే కొంత కష్టమైన పనేనన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ...
అప్పటి వరకూ అజారుద్దీన్ ఖాళీగా ఉండాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అజారుద్దీన్ రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనారిటీ వర్గానికి చెందిన ఏకైక మంత్రి. అటువంటి మంత్రిని తప్పించడమంటే మైనారిటీల్లో అసంతృప్తి వస్తుందేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేవలం ఎన్నికల కోసం అజారుద్దీన్ ను మంత్రి పదవిలో నియమించారన్న వాదన మైనారిటీల్లో బలపడకుండా ఉండేందుకు ఏదో ఒకటి ప్రభుత్వం చేయాల్సి ఉంది. కానీ త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతున్న సమయంలో సందిగ్ధంలో అజారుద్దీన్ మంత్రి పదవి పడిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంకటమనే చెప్పాలి. ఈ పరిస్థితి నుంచి ఎలా అధిగమిస్తారన్నది చూడాలి.