Hyderabad : అర్ధం కాదా.. నిల్వలున్నాయంటున్నా.. వినరేమిటయ్యా సామీ
పెట్రోలు, డీజిల్ కొరత దేశంలోనే లేదు
పెట్రోలు, డీజిల్ కొరత దేశంలోనే లేదు. హైదరాబాద్ మాత్రమే కాదు .. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ పెట్రోల్, డీజిల్ కొరత లేదు. అయినా సరే పెట్రోలు బంకులు మూత పడుతున్నాయి. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆయిల్ కంపెనీల నుంచి రోజుకు ఒక పెట్రోలు బంకుకు ఒక ఆయిల్ ట్యాంకర్ వస్తుంది. అది రెండు రోజులకు సరిపోతుంది. అయితే ఒక్కసారిగా ప్రజలు పెట్రోలు బంకులకు రావడంతో స్టాక్ లేక మూతబడుతున్నాయని పెట్రోలు బంకుల యాజమాన్యం చెబుతుంది. ఇది ప్రజలు తమకు తాము సృష్టించుకున్న కొరతే తప్ప వాస్తవంగా ఇంధన కొరత లేదని పెట్రోలియం శాఖ అధికారులు కూడా తెలిపారు.
అసోసియేషన్ ప్రకటించినా...
ఇంధన కొరత లేదని ప్రకటించిన తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ సరఫరా యథావిధిగా కొనసాగుతోందన్న అసోసియేషన్ చెప్పింది. అయినా సరే ప్రజలు వినడం లేదు.హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ వద్ద తగినంత స్టాక్ ఉందని ప్రకటించినప్పటికీ ప్రజలు పానిక్ కు గురై అవసరం లేకపోయినా బంకులకు వచ్చి పెట్రోలు ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు. ఇంధన కొరత ఉందన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచిస్తున్నారు. ముందస్తు కొనుగోళ్లతోనే ఇబ్బంది ఏర్పడుతోందన్న అసోసియేషన్సాధారణ విక్రయాల కంటే దాదాపు మూడు రెట్లు పెరిగాయని చెప్పింది.
ఆర్టీసీ బంపర్ ఆఫర్...
మరొకవైపు ప్రయాణికులకు టీజీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీని ఇచ్చింది. సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే చేయాలని సూచించింది. నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి, కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, దీనిని కొరతగా భావించవద్దని కోరారు.
తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు...
తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుందని, జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సజ్జనార్ వివరించారు.