Revanth Reddy : గేమ్ ఛేంజర్ పై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువైన చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు.

Update: 2025-01-04 12:02 GMT



తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువైన చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కు చెందిన ఐఐటీబృందంతో వెంటనే అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. నెల రోజుల్లోగా దీనిపై తమకు సమగ్రమైన నివేదికను సమర్పించాలని కోరారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి ఐఐటీ బృందంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించనున్నారు. ప్రధానంగా పోలవరం కారణంగా భద్రాచలానికి ఏర్పడే ముప్పును తెలియజేయాలని రేవంత్ రెడ్డి కోరారు. 2027లో గోదావరి వరదల కారణంగా భద్రాచలం మునిగిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

బనకచర్ల ప్రాజెక్టుపై...
బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి మన అభ్యంతరాలను తెలియజేయాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. వరద జలాల ఆధారంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్ర జలనరుల శాఖకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరి నది నుంచి నీటిని కృష్ణానదికి తరలించి అక్కడి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు మళ్లించి అక్కడి నుంచి రాయలసీమలోని అన్ని జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాకు కూడా నీటిని సరఫరా చేయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యమన్నారు.

ఏపీ వాదన ఎలా ఉన్నా...
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలంలో పాటు అనేక గ్రామాలు నీట మునుగుతున్నాయని, గోదావరి నీటిని ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మించి తరలించడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి "గేమ్ ఛేంజర్" అని చెప్పిన ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖలను రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కేవలం వరద నీటిని మాత్రమే తరలిస్తున్నామని, వృధాగా పోయే నీటిని మాత్రమే రాష్ట్రానికి వినియోగించాలని నిర్ణయమని ఏపీ తరుపున వాదన వినిపిస్తుంది. కానీ దానివల్ల తెలంగాణకు కూడా నష్టమేనని ఆ ప్రాంత అధికార పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News