కరెన్సీ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటుతున్నాయి : పట్టాభి

నోట్ల రద్దు సమయంలో శేఖర్‌రెడ్డికి సంబంధించిన వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు, బంగారాన్ని ఆదాయ పన్నుశాఖ స్వాధీనం..

Update: 2022-05-16 11:56 GMT

అమరావతి : వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని ఇసుక వనరులన్నింటినీ తమిళనాడు ఇసుక మాఫియా దళారి జే.శేఖర్‌రెడ్డికి అప్పగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధికార ప్రతినిధి కె. పట్టాభి రామ్‌ ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జేపీ పవర్ వెంచర్స్‌కు ఇసుక కాంట్రాక్టును ఇచ్చిందని, ఆ తర్వాత శేఖర్ రెడ్డి సన్నిహితుడు బోసాని శ్రీనివాస రెడ్డికి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని పట్టాభి రామ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఇసుక బిల్లులన్నీ టర్న్‌కీ పేరుతో జారీ చేస్తున్నారని, వారు డిజిటల్ చెల్లింపులు లేదా ఆన్‌లైన్ ఇన్‌వాయిస్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. ప్రతిరోజూ పెద్దమొత్తంలో అక్రమంగా డబ్బు కూడబెట్టుకుంటున్నారని, కరెన్సీ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటుతున్నాయని ఆరోపించారు.

నోట్ల రద్దు సమయంలో శేఖర్‌రెడ్డికి సంబంధించిన వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు, బంగారాన్ని ఆదాయ పన్నుశాఖ స్వాధీనం చేసుకుందని, అప్పట్లో శ్రీనివాసరెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిపి డబ్బులు పట్టుకున్నారని పట్టాభి తెలిపారు. ఈ విషయాలన్నీ 2016 డిసెంబరు 9న ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమయ్యాయని అన్నారు. ఇప్పుడు శేఖర్‌రెడ్డి ఆంధ్ర ఇసుక మాఫియా డాన్‌గా మారారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని శేఖర్‌రెడ్డి చేతిలో పెట్టాలని ముందుగానే నిర్ణయించుకున్నారన్నారు. శేఖర్ రెడ్డి నిస్సందేహంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బినామీనే అని పట్టాభి రామ్ ఆరోపించారు. శేఖర్ రెడ్డి భాగస్వామి బోసాని శ్రీనివాస రెడ్డికి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీకి మార్చి 2021 వచ్చే వరకు ఏపీ ఇసుక తవ్వకాలు ఆగిపోయాయన్నారు. చంద్రబాబు హయాంలో గతంలో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రూ.1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.7వేలు.. టీడీపీ హయాంలో లారీ ఇసుక రూ.5 వేలు ఉండగా రూ.20 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోందని ఆరోపించారు.


Tags:    

Similar News