బ్రేకింగ్ : రేపే బలపరీక్ష...:సుప్రీం" తీర్పు

రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బలపర్చింది

Update: 2022-06-29 15:46 GMT

రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బలపర్చింది. శివసేన వేసిన పిటీషన్ ను తోసి పుచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు జరగబోయే విశ్వాస పరీక్షకు సంబంధించి శివసేన వేసిన పిటీషన్ పై వాదనలు జరిగాయి. దాదాపు మూడున్నర గంటల పాటు వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు నిచ్చింది.

అంత తక్కువ సమయమా?
శివసేన తరుపున అభిషేక్ సింఘ్వీ వాదనలను వినిపించారు. బలపరీక్షకు 24 గంటలు సమయమిస్తే ఎలా అని సింఘ్వీ వాదించారు. తమ ఎమ్మెల్యేలు ఇద్దరికి కరోనా సోకిందని, మరికొందరు విదేశాలకు వెళ్లారని పేర్కొన్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు బలపరీక్ష జరిగిన సందర్భంలో ఓటు హక్కు ఉండకుండా చూడాలని కూడా సింఘ్వి కోరారు. బలపరీక్ష జరపకపోతే ముంచుకొచ్చే ప్రమాదమేమీ లేదని సింఘ్వి వాదించారు.
విచక్షణాధికారంతోనే....
ఏక్‌నాథ్ షిండే తరుపున న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. అనర్హత పిటీషన్, ఫ్లోర్ టెస్ట్ రెండు వేరు వేరు అంశాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో బలపరీక్ష కీలకమైనదని తెలిపారు. ఉద్ధవ్ థాక్రే విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పారు. గవర్నర్ కు విచక్షణాధికారాలు ఉన్నాయని కౌల్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు కాబట్టే గవర్నర్ బలపరీక్షకు నిర్ణయం తీసుకున్నారన్నారు. స్పీకర్ ను ఉంచాలా? లేదా? అన్నది ముందు నిర్ణయించాలని ఆయన వాదించారు. షిండే వర్గమే అసలైన శివసేన అంటూ వాదించారు. గవర్నర్ తరుపున ప్రముఖ న్యాయవాది తుషార్ మెహతా వాదనలు విన్పించారు. చీలిక వర్గం రాసిన లేఖతో ప్రస్తుత ప్రభుత్వం మైనారిటీలో పడిందని, అందుకే గవర్నర్ ఫ్లోర్ టెస్ట్ కు ఆదేశించారని ఆయన వాదించారు.


Tags:    

Similar News