ఈసారి ఆచితూచి అడుగులేస్తా.. ఆశీర్వదించండి

2024లో జనసేనకు మద్దతుగా నిలబడాలని కోరారు. గుడ్డిగా తనను నమ్మవద్దని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పవన్ పిలుపు నిచ్చారు

Update: 2022-11-27 07:33 GMT

తనకు ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పే అలవాటు లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను ప్రధానితో మాట్లాడినప్పుడు అభివృద్ధి, దేశ భవిష్యత్తు గురించి మాట్లాడతానని తెలిపారు. వైసీపీని దెబ్బకొట్టాలంటే ప్రధానితో చెప్పి చేయనని, తానే వచ్చి చేస్తానని అన్నారు. ఆంధ్రలో పుట్టిన వాడినని, ఆంధ్రలోనే తేల్చుకుంటానని పవన్ కల్యాణ‌ అన్నారు. ఇక్కడ సమస్యలు వస్తే తాను ఢిల్లీకి వెళ్లి చెప్పనని అన్నారు. అధికారంలో లేని వాడిపై ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి చాడీలు చెబుతారా? అని ప్రశ్నించారు. తనమీద పడి ఎందుకు ఏడుస్తారని ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీలో చాడీలు చెప్పే...
గుండెల్లో సత్తా ఉండబట్టే తనను చూసి భయపడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రధానితో ఏం మాట్లాడానో సజ్జలకు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. తన అభిమానులు కూడా వైసీపీకి ఓటేశారని, అందుకే అన్ని సీట్లు వచ్చాయన్నారు. 151 సీట్లు ఇచ్చారని, ఈసారి ఓటమి ఖాయమని చెప్పారు. ఎన్టీఆర్ కు, జగన్ కు పోలిక ఎక్కడది అని పవన్ ప్రశ్నించారు. జగన్ సమయం సందర్భం లేకుండా నవ్వుతుంటారని అని సెటైర్ వేశారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసిన డబ్బుతో పథకాలను ఇచ్చి వాటికి నీ పేర్లు పెట్టుకోవడమేంటని పవన్ ప్రశ్నించారు.
జనసేనను ఆదరించండి...
వైఎస్సార్ గాంధీ, అంబేద్కర్ కంటే గొప్ప వ్యక్తి కాదని పవన్ అన్నారు. 2024, 2029 ఎన్నికలు చాలా కీలకమని పవన్ అన్నారు. 2024లో జనసేనకు మద్దతుగా నిలబడాలని కోరారు. గుడ్డిగా తనను నమ్మవద్దని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పవన్ పిలుపు నిచ్చారు. తాను అడ్డదారులను తొక్కనని, అవినీతికి పాల్పడనని, పాల్పడనివ్వనని, ఇన్ని సార్లు అందరినీ చూశారని, ఈసారి ప్రతి అడుగు ఆచితూచి వేస్తానని, అందుకు సంపూర్ణ సహకారం ఇవ్వాలని కోరారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించినా, బెదిరించినా ఎల్లవేళలా అధికారంలో ఉండరని వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.


Tags:    

Similar News