కండువా అదే.. కానీ కంటెస్ట్ మాత్రం?

సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకోనున్నారు

Update: 2022-12-13 06:54 GMT

సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు తన అనుచరులకు ఆయన సంకేతాలు పంపారు. గులాబీ పార్టీలో ఇమడలేకపోతున్న జూపల్లి కృష్ణారావు త్వరలో పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలిసింది. టీఆర్ఎస్ లో ఉంటే తనకు భవిష్యత్ లేదని జూపల్లి భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. చివరకు ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినా ఆయన కార్యక్రమంలో కన్పించ లేదంటే టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆయన ఎంత అసంతృప్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

మంత్రి పదవికి రాజీనామా చేసి...
జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి వచ్చి మరీ టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ అప్పటికి అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన పదవిని పక్కన పెట్టి మరీ 2011లోనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొల్లాపూర్ లో పట్టున్న జూపల్లి కృష్ణారావు ఐదు సార్లు కొల్లాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రికార్డు ఆయన కెరీర్ లో ఉంది. 2014లో గెలిచిన జూపల్లి కృష్ణారావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఆయన కూడా జిల్లాలో అందరినీ కలుపుకుని వెళుతూ పార్టీని మరింత బలోపేతం చేేసే ప్రయత్నం చేశారన్నది గులాబీ పార్టీలో ప్రతి ఒక్కరూ అంగీకరించేదే.

బీరం గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో...
అయితే 2018 ఎన్నికల్లో మాత్రం జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి ఓటమి పాలయ్యారు. అప్పుడు గెలిచిన బీరం హర్షవర్థన్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కొల్లాపూర్ లో రెండు వర్గాలు తయారయ్యాయి. జూపల్లి కృష్ణారావుకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని భావించినా అటువంటిదేమీ జరగక పోగా, వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే టిక్కెట్లు అని కేసీఆర్ ప్రకటించడం కూడా జూపల్లి కృష్ణారావు అసహనానికి కారణమయింది. తొలి నుంచి నమ్ముకున్న తనను కాదని మధ్యలో పార్టీలో చేరిన బీరంను హైకమాండ్ ప్రోత్సహించడాన్ని ఆయన సహించలేకపోతున్నారు. అందుకే హర్షవర్ధన్ రెడ్డిపై ఆయనక కాలు దువ్వుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చకు రావాలని పట్టుబడుతున్నారు.
ఆ రెండు పార్టీలకు దూరమే...
అంతేకాదు ఇటీవల కాలంలో బీరం హర్షవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా కరపత్రాలను ముద్రించి నియోజకవర్గంలో పంచుతున్నారు. దీంతో పాటు మండలాల వారీగా ఆత్మీయ సదస్సులను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి జూపల్లి మరో ప్రస్థానం అని పేరు పెట్టి మరీ మండలాల వారీగా పర్యటిన్తున్నారు. కార్యకర్తలతో నిరంతరం టచ్ లో ఉంటున్న జూపల్లి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. హర్షవర్ధన్ రెడ్డితో పేచీ చివరకు పార్టీ మారే స్థిితికి తీసుకువచ్చింది. అయితే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధంగా లేరు. అలాగే తాను దశాబ్దకాలం పాటు ఉన్న కాంగ్రెస్ లోకి వెళ్లడం కూడా ఆయనకు ఇష్టం లేదు. ఆయన మరోసారి స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.

స్వతంత్రంగానే...
స్థానిక సంస్థల ఎన్నికలలోనూ కొల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలను తన అనుచరులనే ఎన్నికయ్యేలా చూసుకున్నారు. దీంతో ఆయనకు పట్టు పెరిగింది. ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరుపున తన అనుచరులను బరిలోకి దింపి సవాల్ విసిరి మరీ గెలిపించుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో తాను పోటి చేసి గెలిచి ఏ పార్టీ అధికారంలోకి వస్తే అందులోకి వెళ్లాలన్న యోచనలో జూపల్లి కృష్ణారావు ఉన్నారని తెలిసింది. తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఉండటంతో ఆయన కాంగ్రెస్, బీజేపీలో చేరకూడదని నిర్ణయించుకున్నారని చెబుుతున్నారు. మొత్తం మీద జూపల్లి ఏ పార్టీలో చేరకుండానే అధికార పార్టీ ఎమ్మెల్యే కావాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.


Tags:    

Similar News