Telangana : ప్రజా సంక్షేమ పాలన దిశగా ప్రభుత్వ నిర్ణయాలు
తెలంగాణాలో ప్రజా సంక్షేమ పాలన సాగుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు
తెలంగాణాలో ప్రజా సంక్షేమ పాలన సాగుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. తెలంగాణ పురోగతిలో ప్రతి పౌరుడు భాగస్వామిగా మారారని అన్నారు.కోర్, ప్యూర్, రేర్ గా తెలంగాణను మూడు రకాలుగా విభజించి అభివృద్ధి చేయాలని నిర్ణయించాని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. దేశానికి దిక్సూచీగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని అన్నారు. 2047 నాటికి మూడు ట్రిలియన్డాలర్ల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. హిల్ట్ పాలసీ ప్రకారం పారిశ్రామిక దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు.
రైజింగ్ స్టేట్ గా...
2047 తెలంగాణ రైజింగ్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. ప్రజలకు భద్రత, రక్షణ కల్పించేలా నాలుగు పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. 55 కిలోమీటర్ల మేరకు మూసీ పునరుజ్జీవ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకూ మూసీ పునరుజ్జీవ పనులను చేపడతామని తెలిపారు. జిహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి ప్రజలకు మెరుగైన పాలనను అందించే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. ఏడాది కాలంలో అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని గవర్నర్ తెలిపారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు.
రైతుల కోసం...
మెట్రో రైలును శంషాబాద్ విమానాశ్రయం వరకూ విస్తరిస్తున్నామని చెప్పారు. బుల్లెట్ రైలుకు శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా మారబోతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా వెల్లడించారు. శ్రమించే తత్వంగల శాంతికాముకులు తెలంగాణ ప్రజలు అని అన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ కు అనుబంధంగా అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని అన్నారు. రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు తరలి వస్తున్నాయని, లక్షలాది మందిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. రైతుల ప్రయోజనం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రుణ మాఫీ ని చేశామని, మరో విడత రైతు భరోసా నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. పేదలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. రానున్న కాలంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారుర. బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్య గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన ప్రసంగాన్ని కొనసాగించారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఆవిష్కరించారు.