అసహనంతో ఆనం... డిసెషన్ త్వరలోనేనా?

సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తన వర్గాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారన్న అసహనంలో ఉన్నారు

Update: 2021-12-18 06:44 GMT

సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మంత్రి పదవి దక్కుతుందో లేదో? అన్న అనుమానం ఒకవైపు, తన వర్గాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారన్న అసహనం మరో వైపు ఆయనలో అసంతృప్తి మరింత పెంచింది. నెల్లూరు జిల్లా రాజకీయాలను ఒకనాడు శాసించిన ఆనం రామనారాయణరెడ్డి నేడు సాదాసీదా నేతగా మారిపోయారు. వైసీపీలో చేరి తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఆయనలో కన్పిస్తుందంటున్నారు.

దశాబ్దాలుగా...
ఆనం కుటుంబం దశాబ్దాలుగా నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తుంది. ఆనం కుటుంబానికి ఆత్మకూరు, నెల్లూరు రూరల్, పట్టణ, వెంకటగిరి వంటి నియోజకవర్గాల్లో పట్టు ఉంది. అక్కడ ఆ కుటుంబానికి ప్రత్యేక ఓటు బ్యాంకుతో పాటు వర్గం కూడా ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన ఆనం రామనారాయణరెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఆయనకు ఆత్మకూరు కాకుండా వెంకటగిరి టిక్కెట్ ఇచ్చారు జగన్. అక్కడి నుంచి గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి ఏనాడు సంతృప్తికరంగా లేరు.
తన వర్గం నేతలకు...
ఏ నాయకుడు అయినా తన వర్గాన్ని కాపాడుకోవాలనే చూస్తారు. వారికి పదవులను ఆశిస్తారు. కానీ ఆనం వర్గీయులకు ఎవరికీ ఏ పదవి దక్కడం లేదు. మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆనం రామనారాయణరెడ్డి వర్గానికి అన్యాయం జరిగిందంటున్నారు. ఇక ఆత్మకూరులోనూ తన వర్గం వారిని అక్కడ పూర్తిగా పదవులకు దూరంగా పెట్టారు. దీనిపై అధిష్టానానికి ఆయన చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు.
అప్పటి వరకూ....
దీంతో ఆనం రామనారాయణరెడ్డి పునరాలోచనలో పడ్డారని తెలిసింది. మంత్రి వర్గ విస్తరణ వరకూ వెయిట్ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అనుచరుల నుంచి కూడా ఆయన తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే టీడీపీ కూడా గతంలో ఆనంను పెద్దగా పట్టించుకోలేదు. 2014లో ఓటమి పాలయినా అప్పట్లో ఆనం సోదరులకు కనీసం ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదన్న ఆగ్రహం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డి ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటున్నారు. మొత్తం మీద వైసీపీ నాయకత్వంపై ఆనం రామనారాయణరెడ్డి మాత్రం అసహనం తో ఉన్నారు. అది ఎటువైపు దారితీస్తుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News