రాహుల్... రా.. రా అంటే ఇలానా?

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు జనం నుంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఆయన మాత్రం బాధ్యతలను తీసుకోవడానికి సిద్ధంగా లేరు

Update: 2022-10-07 03:59 GMT

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు జనం నుంచి రెస్పాన్స్ లభిస్తుంది. తమిళనాడు, కేరళలో ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీకి జనం మద్దతు బాగానే ఉన్నట్లు కనపడుతుంది. రాహుల్ లో అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఉంది. ప్రజా సమస్యలపై అవగాహన ఉంది. దేశ పరిస్థితుల పట్ల అవగాహన మెండుగానే ఉంది. ధనిక, బీద అనే అంతరం లేకుండా ఆయన అందరినీ అక్కున చేర్చుకుంటున్న తీరు ఆకట్టుకుంటుంది. రాహుల్ ప్రధాని కావాలని పాదయాత్రలో ఆయనను కలసి వచ్చిన వారు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో సయితం రాహుల్ యాత్రకు మద్దతు పెరుగుతుంది. ఇప్పుడు యువకుడు కాడు. నడి వయస్కుడు. పెళ్లి కూడా చేసుకోలేదు. దేశం కోసం ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు.

నాయకత్వ లక్షణాలు...
కానీ ఆయనలో నాయకత్వ లక్షణాలే లేవంటున్నారు రాజకీయ నిపుణులు. పోరాడే మనస్తత్వం అంతకన్నా లేదు. అది మంచితనమో.. చేతకాని తనమో తెలియదు కాని కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టకపోవడం రాహుల్ చేస్తున్న పెద్ద తప్పిదంగా పార్టీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబానిదే. అధికారంలో ఉన్నప్పుడు వాళ్లే. లేనప్పుడు వాళ్లే ఉండాలని కోరుకునే వారు పార్టీలో అధికంగా ఉంటారు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఉన్న బ్రాండ్ అటువంటిది. అలాంటి బ్రాండ్ ను రాహుల్ క్రమంగా మార్చి వేస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.
అధికారంలో ఉన్ననాడు...
2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు ప్రధాని పదవికి కూడా ఆ కుటుంబం దూరంగా ఉంది. వెనక నుంచి అంతా తామే అయి నడపవచ్చు. పేరుకు మన్మోహన్ సింగ్ ప్రధాని అయినా స్టీరింగ్ సోనియా చేతిలోనే ఉందన్న విమర్శలు రావచ్చు. కానీ ఆ పదేళ్లలో పెట్రోలు ధరలు ఇంతగా పెరగలేదు. గ్యాస్ ధరల అందుబాటులో ఉన్నాయి. ప్రజలపై భారం మోపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాడుతుంది. మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్త అయినా.. ప్రజలపై భారం వేయాలనుకున్నా పదేళ్ల పాటు కుదరలేదంటే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ప్రజాస్వామ్యం అనేవాళ్లు లేకపోలేదు. సోనియాపై విదేశీ మహిళ అనే ముద్ర ఉందనుకుందాం. కానీ రాహుల్ కూడా అధికారిక పదవులకు నాడు దూరంగానే ఉన్నారు.
బాధ్యతలకు దూరంగా...
ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టడానికి రాహుల్ గాంధీకి అన్నీ అర్హతలున్నాయి. అందరి మద్దతు ఉంది. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వేల కిలోమీటర్ల యాత్ర చేస్తూ రిస్క్ చేస్తున్న రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. 2019 ఎన్నికల్లో ఓమి పాలయిన తర్వాత అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఓటమి ఎవరికైనా సహజం. ఓడినంత మాత్రాన ప్రజల మద్దతు లేదనుకోవడం తగదు. బాధ్యతలను తీసుకోకుండా మద్దతివ్వాలని కోరడం కూడా అంతే తప్పు. మల్లికార్జున ఖర్గేను అధ్యక్షుడిగా చేయవచ్చు. పార్టీని నడిపించవచ్చు. కానీ రాహుల్ ఆ పదవి చేపడితే వేరేగా ఉంటుంది. నాయకుడు కాలేని వాడు దేశాన్ని ఎలా నడిపిస్తాడన్న ప్రశ్నను రాహుల్ ఎదుర్కొనవచ్చు. కాంగ్రెస్ ను గెలిపిస్తే తానే ప్రధానిని అని ధైర్యంగా చెప్పుకోవాలి. అప్పుడే జనం నమ్ముతారు. ఇప్పటికే సోషల్ మీడియాలో రాహుల్ పడుతున్న శ్రమకు, వస్తున్న జనాదరణకు ఎంత పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయో... అదే సమయంలో లీడర్ గా ఆయనకు మైనస్ మార్కులే పడుతున్నాయి. ఒకవేళ మళ్లీ కాంగ్రెస్ ఓటమి పాలయినా ఆ నింద రాహుల్ పైనే పడుతుంది కాని ఖర్గే పైన మాత్రం కాదని గుర్తుంచుకోవాలి.


Tags:    

Similar News