ప్రత్తిపాటి ధైర్యం అదేనట

మూడేళ్లుగా చిలకలూరిపేటకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు మూడు నెలల నుంచి యాక్టివ్ అయ్యారు.

Update: 2022-09-05 04:08 GMT

పార్టీ నేతలకు చంద్రబాబు ఇచ్చే వార్నింగ్ ఎంతమాత్రం పనిచేస్తుందో తెలియదు కాని కొందరైతే ఇన్నాళ్లూ పార్టీకి దూరంగా ఉన్న నేతలు మాత్రం యాక్టివ్ అవుతున్నారే చెప్పాలి. యాక్టివ్ గా లేని నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే ప్రసక్తి లేదని చంద్రబాబు అధినేతగా పదే పదే చెబుతున్నారు. అది ఒకరకంగా వార్నింగ్ అనే అనుకోవాలి. ఆ వార్నింగ్ లో ఆచరణ సాధ్యం ఎంత ఉందో తెలియదు కాని బాబు వీక్‌నెస్ తెలిసిన కొందరు నేతలు మాత్రం నేటికీ యాక్టివ్ కాకుండా ధీమాగానే ఉన్నారు. నియోజకవర్గాల్లో తాము తప్ప టీడీపీకి మరో దిక్కులేదన్న భావనతో ఉన్నారు.

మూడు నెలల ముందు వరకూ...
అలాంటి నేతల్లో ప్రత్తిపాటి పుల్లారావు ఒకరు. ఆయన మొన్నటి వరకూ హైదరాబాద్ కే పరిమితమయ్యారు. తన వ్యాపారాలను చూసుకుంటూ కాలం వెళ్లబుచ్చారు. తన నియోజకవర్గమైన చిలకలూరిపేటకు అడపా దడపా వచ్చి వెళ్లడం తప్ప ఈ మూడేళ్లలో పత్తిపాటి పుల్లారావు ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే గడిపారు. ఆయనపై కేసులు నమోదు చేస్తారన్న భయం కావచ్చు. ఎన్నికలకు ముందు పేటకు వచ్చి ఫైట్ చేయవచ్చన్న భావన కావచ్చు. ఆయన మొన్నటి వరకూ పార్టీని పెద్దగా నియోజకవర్గంలో పట్టించుకోలేదు. అమరావతి భూముల సేకరణలో క్రియాశీలకంగా వ్యవహరించిన తనపై ఇక్కడ ఉంటే కేసులు నమోదవుతాయని చెప్పి చంద్రబాబు నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకుని ఉండవచ్చు.
మరో లీడర్....
గత మూడేళ్లుగా చిలకలూరిపేటకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు మూడు నెలల నుంచి యాక్టివ్ అయ్యారు. చిలకలూరిపేటలోనే మకాం పెట్టారు. అప్పటి వరకూ నిరాశలో ఉన్న క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి అక్కడ పుల్లారావు కంటే మరో లీడర్ లేరు. వేరొకరికి టిక్కెట్ ఇచ్చే సాహసం కూడా టీడీపీ అధినాయకత్వం చేయకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రస్తుత మంత్రి విడదల రజనీని ఎదుర్కొనడానికి ప్రత్తిపాటి పుల్లారావుకు మించిన నేత మరొకరు లేరు. మొన్నటి వరకూ అదే ధీమాతో ఉన్న ఆయన చంద్రబాబు సూచనతో తిరిగి యాక్టివ్ అయ్యారంటారు.
బాబు సూచనతో...
తన సామాజిక వర్గానికి ఒక న్యాయం, మరొకరికి మరొక న్యాయం అనే ముద్ర పడటం ఇష్టం లేక ప్రత్తిపాటిని నియోజకవర్గంలోనే ఉండాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. మొన్నటి వరకూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్ బాబులు తప్ప మరెవ్వరూ యాక్టివ్ గా లేరు. చంద్రబాబు పదే పదే వార్నింగ్ ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదు. పత్తిపాటి ప్రత్యేక పర్మిషన్ తో రెండున్నరేళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండగలిగారు. మిగిలిన నేతలకు ఆ అవకాశమూ లేదు. చంద్రబాబు వద్ద అంతటి చనువు లేదు. అందుకే మిగిలిన నేతలు మిన్నకుండి పోయారు. ప్రత్తిపాటి మాత్రం మూడు నెలల క్రితం పేటలో ఎంట్రీ ఇచ్చి తన సీటుకు తిరుగులేదన్న సంకేతాలను పంపుతున్నారు. నిజమే ప్రత్తిపాటిని కాదని చిలకలూరిపేటలో మరొకరికి టిక్కెట్ ఇచ్చే ధైర్యమూ ఎవరికి లేదు. ఆ స్థాయి నేత కూడా అక్కడ టీడీపీలో లేరు.
ప్రచారాలను నమ్మొద్దు....
కాగా ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ మారుతున్నారంటూ ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతోంది. తాడేపల్లి లోని జగన్ నివాసానికి వెళ్లినట్లుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీనిపై ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. తనపై దుష్ప్రచారానికి కొందరు దిగుతున్నారని, క్యాడర్ ను అయోమయంలో పడేసేందుకు ఈ రకమైన ప్రచారాన్ని చేస్తున్నార్నారు. తాను పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నానని, తిరిగి పార్టీకి ఇక్కడ ఆదరణ లభిస్తుండటంతో ఓర్వలేని కొందరు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు.


Tags:    

Similar News