ఊహించిందే కానీ.. ఇంత త్వరగానా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు

Update: 2022-10-18 11:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో వీరిద్దరూ సమావేశమయ్యారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించడానికేనని పవన్ చెబుతున్నప్పటికీ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇద్దరూ సమావేశమయ్యారని తెలిసింది. చాలా రోజుల తర్వాత ఇద్దరి నేతల భేటీ ఆసక్తికరంగా మారనుంది.

విశాఖ నుంచి...
విశాఖ నుంచి పవన్ విజయవాడ రావడం వెనక కూడా ఇదే కారణం ఉందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ అవసరమైతే బీజేపీతో తెగదెంపులకు కూడా సిద్ధమవుతున్నారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా కొద్దికాలమే సమయం ఉండటంతో ఈ భేటీ కీలకంగా మారనుంది. తొలి నుంచి చంద్రబాబు కూడా పొత్తు పట్ల ఆసక్తి కనపరుస్తున్నారు. ఆయన రెండేళ్ల క్రితమే కుప్పం పర్యటనలో వ్యాఖ్యానించిన విషయాలను గుర్తుంచుకోవాలి. లవ్ వన్ సైడ్ ఉంటే సరిపోదు అని టూ సైడ్ ఉండాలని నాడు చంద్రబాబు అన్న మాటలు నేడు కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నాయి.
గంటకు పైగానే...
మధ్యాహ్నం 3.25 గంటలకు ప్రారంభమయిన సమావేశం ఇంకా జరుగుతూనే ఉంది. పవన్ కల్యాణ్ కూడా బీజేపీతో కలసి పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. బీజేపీ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తుందని పవన్ భావన. అందునా బీజేపీ ఏపీలో బలహీనంగా ఉంది. మరోసారి ఓటమి పాలయి పార్టీని మరో ఐదేళ్ల పాటు భారంగా నడిపేకన్నా టీడీపీతో కలసి అధికారంలోకి రావాలన్న యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారు. అందుకే ఆయన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని విజయవాడకు ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ వచ్చారని చెబుతున్నారు. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ అని కూడా పవన్ పదే పదే అంటున్నారు.
కొత్త విషయమేమీ కాకున్నా...
అయితే ఇది ఊహించిందేమీ కాదు. కొత్త విషయమేమీ కాదు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీకి మద్దతు ప్రకటించారు. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ పొత్తులపై సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తాము చీల్చకుండా చూస్తామని కూడా పవన్ ప్రకటించారు. వీటన్నింటి నేపథ్యంలో జనసేన, టీడీపీ పొత్తు కుదురుతుందని అందరూ భావించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కొన్ని చోట్ల రెండు పార్టీలు కలసి పోటీ చేశాయి. అయితే ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నట్లే కనపడుతుంది. అందుకే ఈ భేటీ అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.


Tags:    

Similar News