విశాఖకు చేరుకున్న ప్రధాని మోది.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం జగన్
ప్రధాని రోడ్ షో కోసం బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. పవన్ కంటే ముందే ఏపీ బీజేపీ నేతలు ప్రధాని మోదీని కలవనున్నారు
pm modi arrives in vizag
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి విశాఖ ఐఎన్ఎస్ డేగ చేరుకున్న ప్రధానికి.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. మారుతీ జంక్షన్ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో జరుగుతుంది. ఈరోజు రాత్రి జనసేనాని పవన్ కల్యాణ్ ప్రధాని మోదీతో భేటీ కానున్నారన్న విషయం తెలిసిందే. అందుకోసం ఆయన ఐఎన్ఎస్ చోళకు వెళ్లారు. కాగా.. తమిళనాడులో వర్షం కారణంగా ప్రధాని విశాఖకు రావడం కాస్త ఆలస్యమైంది.
ప్రధాని రోడ్ షో కోసం బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. పవన్ కంటే ముందే ఏపీ బీజేపీ నేతలు ప్రధాని మోదీని కలవనున్నారు. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభలో ఎనిమిది మందికే అనుమతించారు. ప్రధానితో పాటు వేదికపై గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, బీజేపీ ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, పీవీఎన్ మాధవ్ మాత్రమే ఉంటారు. ఈ సభలో ప్రధాని మోదీ 40 నిమిషాల పాటు, ఏపీ సీఎం జగన్ 7 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహిస్తారు. విశాఖలో ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.