సాధారణంగా వీఐపీల పెళ్లిలకు లేదా వీఐపీలు హాజరయ్యే పెళ్లిలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మరీ పెద్దవారిదైతే 10 మందో 20 మందో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. కానీ, ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ బారాత్ కు 10 మంది సీఐలు, 22 మంది ఎస్సైలు, 150 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు. అలా అని ఆ వివాహం ఎవరో బిలియనీర్ కుటుంబానిదో, రాజకీయ నేత కుటుంబానిదో కాదు. కేవలం ఓ సాధారణ యువకుడిది. కులాల మధ్య గొడవ కారణంగానే పోలీసులు ఈ వేడుకకు ఈ రేంజ్ లో భద్రత కల్పించాల్సి వచ్చింది. దీంతో 80 ఏళ్ల తర్వాత ఆ ఊరిలో ఓ దళితుడి బారాత్ తీయగలిగారు.
హైకోర్టు వరకు వెళ్లి మరీ...
యూపీలోని కిషన్ గంజ్ సమీపంలోని నిజాంపూర్ గ్రామినికి చెందిన శీతల్ అనే అమ్మాయితో సంజయ్ జాతవ్ అనే యువకుడి పెళ్లి ఆరునెలల కిందే జరగాల్సి ఉంది. అయితే, ఊరేగింపుగా వధువు ఇంటికి వరుడు రావాల్సి ఉంటుంది. కానీ, గ్రామంలోని కొందరు ఠాకూర్లు తమ వీధుల మీదుగా దళితుల ఊరేగింపు వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో వరుడు సంజయ్ పోలీసులకు, యూపీ సీఎం యోగీ ఆధిత్యనాధ్ కు ఫిర్యాదు చేయడంతో పాటు అలహాబాద్ హైకోర్టునూ ఆశ్రయించాడు. దీంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో నేరుగా జిల్లా మెజిస్ట్రేట్ ఆర్పీ సింగ్ స్వయంగా జోక్యం చేసుకుని ఇరువర్గాల వారి మధ్య ఒప్పందం చేయించారు. అయినా కూడా ఎటువంటి శాంతిభద్రతల సమస్య రాకుండా భారీ బందోబస్తు మధ్య వేడుకను నిర్వహించారు. అయితే, తమను విలన్లుగా చూపిస్తున్నారని, తమ గ్రామంలో దళితులు, ముస్లింలతో తామంతా కలిసే ఉంటామని ఠాకూర్లు అంటున్నారు. పెళ్లి ఊరేగింపు మామూలు వధువు ఇంటి వద్దకు ఉంటుందని, కానీ వరుడు కావాలని ఊరంతా గుర్రపు బగ్గీపై ఊరేగింపు తీయడాన్ని మాత్రమే తాము వ్యతిరేకించామని పేర్కొన్నారు. ప్రశాంతంగా, ఎటువంటి కుల కలహాలు లేని తమ మధ్య పెళ్లికొడుకు సంజయ్ గొడవ పెట్టాడని, తప్పుడు ఫిర్యాదుతో మమ్మల్ని దోషులుగా చూపించారని ఆరోపించారు.