టీడీపీ లో టిక్కెట్ కావాలంటే.. ఇలాగేనట

టీడీపీలో ఎవరు అవునన్నా కాదన్నా లోకేష్ కీలక నేత. ఆయన మాటకు విలువ, గౌరవం ఉంటుంది. పార్టీలో ఆయనే ఇప్పుడు టిక్కెట్ల దాత.

Update: 2022-06-08 12:38 GMT

తెలుగుదేశం పార్టీలో ఎవరు అవునన్నా కాదన్నా లోకేష్ కీలక నేత. ఆయన మాటకు విలువ, గౌరవం ఉంటుంది. ర్టీలో ఆయనే ఇప్పుడు టిక్కెట్ల దాత. పార్టీకి భవిష్యత్ నేత కావడంతో లోకేష్ పాత్రను పార్టీలో ఎవరూ కాదనలేని పరిస్థితి. చంద్రబాబు కూడా లోకేష్ మాటను కాదనే పరిస్థితి లేదు. ఇటీవల మహానాడులో లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీ నేతలను ఆలోచనల్లో పడేశాయి. వరసగా మూడు సార్లు ఓటమి పాలయిన వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదని ఖరాఖండీగా చంద్రబాబు ఎదుటే చెప్పారు. అంటే దీన్ని బట్టి లోకేష్ భవిష్యత్ లో టిక్కెట్లు కేటాయింపులో కూడా కీలకంగా వ్యవహరిస్తారన్న ప్రచారం జరుగుతుంది.

లోకేష్ కు పెరిగిన...
ఇప్పటికే ఆనం వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు లోకేష్ ను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. తమకు ఆత్మకూరు టిక్కెట్ ఇవ్వాలని అడిగినా పార్టీ సంప్రదాయంగా తీసుకున్న నిర్ణయం కావడంతో అక్కడ పోటీకి పార్టీకి దూరంగా ఉన్న విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి లోకేష్ ను కలిశారు. నేరుగా చంద్రబాబును కలవకుండా లోకేష్ ను వీర శివారెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరశివారెడ్డి సీనియర్ నేత. దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. అయినా లోకేష్ ను కలిసి తన టిక్కెట్ పై హామీ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
కమలాపురం నుంచి...
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా అయిన కడపలోని కమలాపురం నియోజకవర్గంలో వీరశివారెడ్డి కీలకనేత. అక్కడ పార్టీ ఇన్‌చార్జిగా పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు. ఆయనకూడా బలమైన నేత. వీర శివారెడ్డి గత దశాబ్దకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కమలాపురానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 2004 లో టీడీపీ నుంచి, 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయనకు టిక్కెట్ దక్కక పోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల మహానాడులో లోకేష్ వరసగా మూడుసార్లు ఓటమి పాలయిన వారికి టిక్కెట్లు ఇవ్వబోమని ప్రకటించారు.
నాలుగు సార్లు వరసగా....
పుత్తా నరసింహారెడ్డి కమలాపురం నుంచి వరసగా 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. దీంతో పుత్తా నరసింహారెడ్డికి టిక్కెట్ రాదని భావించిన వీర శివారెడ్డి తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని లోకేష్ ను కోరినట్లు తెలిసింది. టిక్కెట్ హామీ వస్తే టీడీపీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన లోకేష్ కు చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబును కూడా వీర శివారెడ్డి త్వరలో కలిసి పార్టీలో చేరతారని తెలిసింది. వీరశివారెడ్డి పార్టీలో చేరిక మరింత బలం చేకూరుతుందని టీడీపీ అధినాయకత్వం కూడా భావిస్తుంది.
బాబును కలిసినా...?
మరోవైపు పుత్తా నరసింహారెడ్డి ఇటీవల చంద్రబాబు పర్యటనలో కీలకంగా మారారు. కడప జిల్లాలో చంద్రబాబు బాదుడే బాదుడే కార్యక్రమం విజయవంతం కావడానికి పుత్తా నరసింహారెడ్డి కారణమని చెబుతున్నారు. చంద్రబాబు రోడ్ షోకు ఆయనే ఎక్కువ మందిని జనసమీకరణ చేశారంటున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా చంద్రబాబును కలిస్తే వర్క్ అవుట్ కాదనుకున్నారేమో? వీర శివరారెడ్డి తొలుత చినబాబును సంప్రదించారు. చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వీర శివారెడ్డి త్వరలోనే టీడీపీలో చేరే అవకాశముంది. లోకేష్ ను ముందుగా కలిసింది కూడా మహానాడులో ఆయన చేసిన వ్యాఖ్యలతో పాటు చంద్రబాబుకు నచ్చ చెబుతారనే కారణం కావచ్చు. మొత్తం మీద టిక్కెట్ కావాల్సిన నేతలు ముందుగా లోకేష్ ను కలుస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News