కేసీఆర్ తో విమానమెక్కే ఏపీ నేతలెవరు?

ఆంధ్రప్రదేశ్ నుంచి కొందరు ముఖ్య నేతలను బీఆర్ఎస్ లోకి చేర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నారు

Update: 2022-10-04 03:04 GMT

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీలో చేరేదెవరు? ఏపీ నుంచి కొందరు నేతలు చేరేందుకు రెడీగా ఉన్నారా? ఎవరు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు? పార్టీ పెట్టిన వెంటనే తొలుత ఆంధ్రప్రదేశ్ నుంచే చేరికలు ఆ పార్టీలో ఉంటాయా? అంటే అవుననే చెబుతున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. భారత రాష్ట్ర సమితిని కేసీఆర్ పెట్టడం ఖాయమయింది. ఈనెల 5వ తేదీన ఆయన పేరును ప్రకటించబోతున్నారు. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించడానికి కూడా కేసీఆర్ ప్రత్యేకంగా ప్రణాళిక రచించారు.

చేరికలు లేకపోతే...
అయితే పార్టీ పెట్టిన తర్వాత చేరికలు లేకపోతే ఏం బాగుంటుంది? జోష్ ఎలా వస్తుంది? నలుగురూ నాలుగు విధాలుగా నవ్విపోరూ? కేవలం తన పక్కన తిరిగే నేతలే జాతీయ పార్టీలోనూ కనిపిస్తే ఏం గ్లామర్ ఉంటుంది? ఫేస్ వాల్యూ అయినా కావద్దూ.. అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. అందుకే మొన్నటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత కొందరు నేతలు ఎటు కాకుండా పోయారు. వారు బీజేపీలో చేరలేరు. కాంగ్రెస్ లో ఉండలేరు. అలాగని అధికార వైసీపీలోకి వెళ్లలేరు. తెలుగుదేశం పార్టీలో కూడా ఖాళీ లేదు.
ఏపీ నేతలను...
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కొందరు ముఖ్య నేతలను బీఆర్ఎస్ లోకి చేర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నారు. వారు సామాజికపరంగా కూడా బలమైన నేతలే. కానీ టైం కలసిరాక కొందరు రాజకీయాలకు ఎనిమిదేళ్ల నుంచి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలో ఇలాంటి నేతలు చాలా మంది ఉన్నారు. వారితో గతంలో కేసీఆర్ కు పరిచయాలున్నాయి. వారు ఏపీకి చెందిన వారయినా ఉండేది హైదరాబాద్ లోనే. అందుకే వారిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటే కొంత వరకూ ఉపయోగం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. వారికి రాజకీయ అవసరాన్ని కూడా కేసీఆర్ గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
పార్టీ కమిటీలోనూ...
అలాంటి వారిని కొందరిని గులాబీ బాస్ ఎంపిక చేసుకున్నారని సమాచారం. వారితో ఇప్పటికే ఫోన్ లో కేసీఆర్ మాట్లాడినట్లు తెలిసింద.ి కొందరు సుముఖంగా కూడా ఉన్నారు. తెలంగాణలో ఆ పార్టీ అధికారంలో ఉండటంతో కొన్ని అదనపు ప్రయోజనాలు తమకు చేకూరుతాయని వారు ఆశించి అంగీకరించి ఉండవచ్చు. తెలంగాణ నేతలతో కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలతోనే పార్టీ కమిటీని ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలంటే ఎక్కువగా పొరుగున ఉన్న ఏపీ నేతలను పార్టీలోకి చేర్చుకోవడమే మంచిదన్న ఆలోచనలో ఉన్నారట. మొత్తం మీద కేసీఆర్ విమానంలో ఎక్కేందుకు ఏపీ నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. త్వరలోనే వారు బీఆర్ఎస్ లో చేరతారన్నది గులాబీ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.


Tags:    

Similar News