ట్రెండ్ అంతా కాంగ్రెస్‌కే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక ఎల్లుండి ఫలితాలు వెలువడనున్నాయి

Update: 2023-05-11 03:56 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక ఎల్లుండి ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే గోవాలో, ముంబయిలో ఫైవ్ స్టార్ హోటళ్లలో కొన్ని పార్టీలు రూంలను బుక్ చేశాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను క్యాంప్‌లకు తరలించేందుకు సిద్ధమయ్యాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమకు పట్టున్న ప్రాంతంలో ఎమ్మెల్యేల క్యాంప్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. బీజేపీ గోవా, ముంబయిలోనూ, కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌లోనూ ప్రత్యేకంగా గదులను సిద్ధం చేసినట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ కే ట్రెండ్ కనపడుతున్నప్పటికీ హంగ్ దిశగా ఫలితాలు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించాలని నిర్ణయించాయి.

క్యాంప్‌కు అంతా సిద్ధం...
అందుకోసం ప్రత్యేకంగా కొందరు ముఖ్యమైన నేతలను రెండు పార్టీలూ నియమించారు. పోలింగ్ సరళి ప్రారంభమైన తర్వాత అభ్యర్థులను క్యాంప్‌లకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 13వ తేదీ పది గంటలకల్లా ట్రెండ్ తెలిసిపోతుంది. ట్రెండ్ ను బట్టి రెండు పార్టీలూ ఎమ్మెల్యే అభ్యర్థులను క్యాంప్‌లకు తరలించేందుకు అన్నీ రెడీ చేసుకున్నాయి. ఇప్పటికే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ అందుకుంటుందా? లేదా? అన్నది మాత్రం సర్వే సంస్థలకు కూడా అర్థం కాకుండా ఉంది. ఇటు హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని చెప్పలేని పరిస్థితి. అలాగని కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని కూడా గట్టిగా అనలేని స్థితి.
జేడీఎస్‌ను రెండు పార్టీలూ...
ఈ నేపథ్యంలో జేడీఎస్ ను ఈసారి రెండు పార్టీలు కలుపుకునేందుకు సిద్ధంగా లేవు. అవసరమైతే ఏ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అయినా ఉంటారు కాని, జేడీఎస్ కు అధికారం ఇచ్చే పరిస్థిితి లేదని చెబుతున్నారు. జేడీఎస్ ఇప్పటికే ఇటు బీజేపీతోనూ, అటు కాంగ్రెస్‌తోనూ పొత్తు పెట్టుకుని కర్ణాటకలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. అందుకే అది కర్ణాటకలో ఇప్పటికీ నిలబడగలిగిందన్న అంచనాలున్నాయి. కానీ ఈసారి మాత్రం జేడీఎస్ మద్దతు కానీ, ఆ పార్టీకి తాము సపోర్టు ఇవ్వడం కాని చేయకూడదని నిర్ణయించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అయితే తాము జేడీఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ముందుగానే చెప్పడం విశేషం.
ముందుగానే నిర్వేదం..
ఇక బీజేపీ కూడా అదేరకమైన ఆలోచనలో ఉంది. జేడీఎస్ మరింత బలహీనం కావాలంటే ఈసారి దానికి అధికారం ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చింది. కర్ణాటకలో ఎటూ ఒకసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండోసారి రాలేదు. దీనిని బట్టి కాంగ్రెస్, బీజేపీలకే అవకాశం ఇవ్వాలని, ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్‌కు పవర్ రుచి చూపించకూడదన్న నిర్ణయానికి ప్రధాన పార్టీలు రెండు రావడంతో కుమారస్వామిలో నిర్వేదం కనిపిస్తుంది. అందుకే ఆయన పోలింగ్ పూర్తికాకముందే తమకు 25 స్థానాలకు మించి స్థానాలు రావని తేల్చారు. డబ్బు ప్రభావం వల్ల తమ వాళ్లు గెలవలేకపోయారని ముందుగానే కుమారస్వామి ఓటమిని అంగీకరించారు. అయితే ఎన్నికల సమయంలో ఎవరూ చెప్పలేని పరిస్థిితి. పోలింగ్ రోజు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News