Karnataka results : మోదీని మోది వదిలిపెట్టారుగా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజీపీకి ఒక గుణపాఠంగా చెప్పుకోవాలి. స్థానిక పరిస్థితులను బట్టి ప్రజలు ఓట్లు వేస్తారు

Update: 2023-05-13 08:02 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజీపీకి ఒక గుణపాఠంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. స్థానిక పరిస్థితులను బట్టి ప్రజలు పార్టీ వైపు చూస్తారు. పరిపాలన చూస్తారు. శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. అవినీతి, అసమర్థతను కూడా అంచనా వేసి మరీ ఈవీఎంలలో జనం బటన్ ను నొక్కుతారు. కర్ణాటక ఫలితాలు కూడా ఇవే చెబుతున్నాయి. అంతే తప్ప అన్ని సార్లు మాయ మాటలను జనం నమ్మరు. ప్రజలు మోసపోరు. ఒకవైపు గ్యాస్, పెట్రోలు ధరలు పెంచుతూ మరోవైపు వచ్చి మేం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే జనం ఎందుకు నమ్ముతారు? అన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమయింది.

మోదీకి కూడా...
కర్ణాటక ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీకి కూడా ఒక లెస్సన్ అని చెప్పుకోవాలి. కర్ణాటకలో ప్రధాని మోదీ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారం చేశారు. ముందునుంచే ఆయన అభివృద్ధి పనులు పేరిట శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వందేభారత్ రైళ్లు ఇచ్చారు. జాతీయ రహదారులను నియమించారు. ప్రధాన స్టార్ క్యాంపెయినర్‌గా మోదీ నిలిచారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. తనను చూసి గెలిపించాలని మోదీ చెప్పారు. తన పనీతీరును చూసి ఓటెయ్యాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు.
హనుమాన్ చాలీసా...
ఇక ప్రధాని హోదాలో ఉండి నరేంద్ర మోదీ జై భజరంగ బలి అని నినాదాలు చేయడం కూడా ప్రజలకు ఏవగింపుగా మారింది. ఒక ప్రధాని హోదాలో ఆ నినాదం చేయడం సరికాదన్న కామెంట్స్ వినిపించాయి. హనుమంతుడు నినాదాన్ని ఎత్తుకున్నా, హనుమాన్ చాలీసాను పఠించినా కూడా ప్రజలు అటు వైపు మొగ్గు చూపలేదు. తమకు శాంతిభ్రదతలు కావాలని, అందరూ కలసి ఉండాలని ప్రజలు కోరుకున్నారే కాని, ఒక వర్గానికి కొమ్ముకాయడాన్ని ప్రజలు హర్షించలేరు. రాష్ట్రంలో సరైన నాయకత్వం లేకపోవడం కూడా బీజేపీ దారుణ ఓటమికి కారణంగా చూపుతున్నారు.
మోదీ ప్రచారం చేసిన...
ప్రధాని మోదీ మొత్తం 40 స్థానాల్లో ప్రచారం చేస్తే 25 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అంటే మోదీ చరిష్మా కన్నడ నాట పనిచేయలేదనే చెప్పాలి. బీజేపీకి దక్షిణ భారత దేశంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రం కర్ణాటకను కూడా ఆ పార్టీ చేజేతులా చేజార్చుకున్నట్లయింది. బీజేపీ హైకమాండ్ స్వయంకృతాపరాధమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ఢిల్లీలో కూర్చుని రాష్ట్రాలను శాసించే పద్ధతికి స్వస్తి పలకాలి. లోకల్ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఓటమికి ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో అక్కడి నేతలే హీరోలు. అంతే తప్ప ఢిల్లీలో కూర్చుని పాలన చేసే వాళ్లు పెత్తనం చేస్తే సహించరన్నది కన్నడ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమయింది.


Tags:    

Similar News