అనిత ఇష్టపడుతున్నారు.. అయినా కష్టమేనట

తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదు

Update: 2022-09-10 06:34 GMT

తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదు. ఆమె ముందు అనేక సవాళ్లున్నాయి. రాష్ట్ర స్థాయి నేతగా ఎదుగుతున్నా పాయకరావుపేటలో మాత్రం ఆమె నిలదొక్కుకోలేకపోతుంది. పాయకరాపుపేటలో ఏ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ అగ్రకులాల వారిదే ఆధిపత్యం. వైసీపీ అయినా టీడీపీ అయినా అక్కడ ఎమ్మెల్యే వారు ఆడించినట్లు ఆడాల్సిందే. ఏమాత్రం తేడా వస్తే వెంటనే వారిపై బురద జల్లే కార్యక్రమం మొదలవుతుంది. ఎమ్మెల్యేకు పాయకరావుపేటలో స్వేచ్ఛ లేదన్నది యదార్థం. గతంలో వంగలపూడి అనిత ప్రస్తుత ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అయినా ఒకటే. సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదుర్కొనాల్సి ఉంటుంది.

ఫైర్ బ్రాండ్ లీడర్ గా...
2014 ఎన్నికల్లో వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పట్లో ఆర్కే రోజాకు ధీటుగా సమాధానమిస్తూ ఫోకస్ అయ్యారు. కొత్తగా ఎమ్మెల్యే అయినా కూడా ప్రతిపక్షాన్ని అప్పట్లో విమర్శించడంలో అనిత చంద్రబాబు వద్ద మంచి మార్కులే కొట్టేశారు. మంత్రి వర్గంలో తనకు చోటు దక్కలేదని ఆమె బాధ పడ్డారు కూడా. చివరకు టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా పదవి ఇవ్వబోతే దానిని కాదనుకున్నారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా వంగలపూడి అనిత ఎదిగారు. దీంతో చంద్రబాబు కూడా అనితకు ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు. అయితే పాయకరావుపేటలో సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఆమెను కొవ్వూరు నియోజకవర్గాన్ని షిఫ్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
ప్రజలు గెలిపిస్తున్నా...
అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు అనితకు కీలక బాధ్యతలను అప్పగించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా చేశారు. తన పదవికి బాగానే న్యాయం చేస్తున్నారు. అయినా ఆమె సొంత నియోజకవర్గంలో మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నారు. నిజానికి పాయకరావు పేట టీడీపీకి కంచుకోట లాంటిది. 1985 నుంచి ఇప్పటి వరకూ టీడీపీ ఆరు సార్లు గెలిచింది. ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పదే పదే ప్రజలు ఆదరించడం పరిపాటిగా వస్తుంది. 1985,1989, 1994లో కాకర నాగరాజు వరసగా మూడుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం చెంగల వెంకట్రావు 1999, 2004లో వరసగా రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గొర్ల బాబూరావు కూడా కాంగ్రెస్ నుంచి 2009, వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు.
సొంత పార్టీ నుంచి...
అలా ప్రజలు మాత్రం నేతలను ఆశీర్వదిస్తూనే ఉన్నా అక్కడ ప్రధాన వర్గాల నేతలకు ఎమ్మెల్యేలు తలొగ్గి ఉండాల్సిందే. అనిత ఆ పని చేయకపోవడంతోనే అంత అసంతృప్తి తలెత్తింది. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉండరన్న పేరు తెచ్చుకున్నారు. అక్కడ టీడీపీని శాసించే సామాజికవర్గం నేతలను దూరం చేసుకున్నారు. దీంతో ఆమెకు మళ్లీ పాయకరావుపేట టిక్కెట్ లభించలేదు. ఈసారి వంగలపూడి అనిత పాయకరావుపేట నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు కూడా అసంతృప్తి వర్గాలకు సర్ది చెప్పి టిక్కెట్ ఇచ్చే విషయంలో సానుకూలంగానే ఉన్నారు. అయినా అనిత పోటీ చేస్తే ఆమెకు సొంత పార్టీ నుంచి అందే సహకారం తక్కువేనని అంటున్నారు. అనిత మాత్రం పాయకరావుపేటలోనే పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి ఆమె పోటీ చేసినా అక్కడి టీడీపీ నేతలు సహకారం లభిస్తుందా? ప్రజలు ఆశీర్వదిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News