వీక్ నెస్ లే... పీకేను మరింత వీక్ చేస్తున్నాయా?

పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఏడేళ్లు కావవస్తుంది. 2014లో జనసేన పార్టీని పెట్టారు. ఆయన 2019 ఎన్నికల్లోనే పోటీ చేశారు

Update: 2021-11-16 04:24 GMT

ఏ పార్టీ అయినా పది కాలాల పాటు బతికి బట్ట కట్టాలంటే పదవులు అవసరం. అందుకే రాజకీయ పార్టీని కొత్తగా పెట్టినా అన్ని ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తారు. జగన్ కొత్త పార్టీని 2011లో పెట్టారు. వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేశారు. క్రమంగా క్షేత్ర స్థాయిలో బలం పెంచుకుంటూ పోయారు. దశాబ్దకాలాలుగా బలంగా ఉన్న టీడీపీని ఎదుర్కొనాలంటే స్థానిక సంస్థల ఎన్నికలే ముఖ్యమని సీరియస్ గా తీసుకుని తగిన విజయాలను సాధించారు. కానీ పవన్ కల్యాణ‌్ ఆలోచన వేరే విధంగా ఉంది.

ఏడేళ్లవుతున్నా....?
పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఏడేళ్లు కావవస్తుంది. ఆయన 2014లో జనసేన పార్టీని పెట్టారు. అయితే ఇప్పటి వరకూ ఆయన 2019 ఎన్నికల్లోనే పోటీ చేశారు. కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే సాధించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసినా పెద్దగా ఫలితాలు కన్పించలేదు. అక్కడక్కడ టీడీపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను జనసేన పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు పార్టీ పరంగా కాకుండా పవన్ కల్యాణ్ నుంచి కింది స్థాయి నేతల వరకూ ఎవరికీ ఎటువంటి పదవి లేదనే చెప్పుకోవాలి.
ఎవరూ ఇటు వైపు....
అందుకే జనసేన వైపు ఎవరూ చూడటం లేదు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ఇలా కాదని పవన్ కల్యాణ్ కు అనేక సూచనలు అందుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. ఆయనకు తనపై తప్ప మరెవ్వరిపైనా నమ్మకం లేకపోవడమే ఇందుకు కారణం. రాజకీయాలు అన్న తర్వాత నమ్మకమే ముఖ్యం. నేతలను నియోజకవర్గాల్లోకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వదిలిపెడితేనే పార్టీ బలోపేతం అవుతుందని సూచిస్తున్నా పవన్ పట్టించుకోవడం లేదు.
ఇక ఎలా?
ఏ పార్టీలోనైనా పదవులు వస్తాయని తెలిస్తేనే ఎగబడతారు. నేతలకు రాజకీయ భవిష్యత్ పై భరోసా నాయకుడు ఇవ్వగలగాలి. అప్పుడే చేరికలు ఉంటాయి. ఏడేళ్ల నుంచి నేతలు వీడటమే తప్ప ఎటువంటి చేరికలు లేకపోవడం జనసేన అధినేత బలహీనతకు నిదర్శనమనే చెప్పాలి. పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ అవుతారని మొన్నటి వరకూ అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన వీక్ నెస్ అర్థమై.. ఆయన తమను ఏం చేయలేరన్న ధీమాను ప్రత్యర్థులు ప్రకటిస్తున్నారంటే ఆయన ఎంత బలహీనంగా మారారో చెప్పనక్కరలేదు.


Tags:    

Similar News