Bhadrachalam: భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

భద్రాచలంలో సీతారాముల వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది

Update: 2026-03-27 06:36 GMT

భద్రాచలంలో సీతారాముల వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. సీతారాముల కల్యాణ విశిష్టతతో పాటు, భద్రాద్రి ఆలయ చరిత్ర, వైభవాన్ని భక్తులకు వేద పండితులు వివరించారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో కల్యాణ వేడుక జరిగింది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పన్నెండు గంటలకు అభిజిత్ ముహూర్తంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ముహూర్తం సమయానికి వేద పండితులు జీలకర్ర బెల్లం పెట్టారు. దీంతో ప్రధాన ఘట్టం పూర్తయినట్లే.

అభిజిత్ ముహూర్తాన...
ఈ సందర్భంగా శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియంతో పాటు, భద్రాద్రి పురవీధులు మార్మోగాయి. అభిజిత్ మూహుర్తాన అర్చకులు.. సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచారు. సీతమ్మకు మాంగళ్యధారణ చేశారు. సీతారాములను వధూవరులుగా చూసి భక్తులు తరించారు. సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందు భక్తుల కోలాహలం, మంగళవాద్యాలు, కోలాట నృత్యాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి తీసుకువచ్చారు. స్టేడియంలోని కల్యాణ పీఠంపై ఉత్సవమూర్తులను ఉంచి సీతారాముల కల్యాణ మహోత్సవ విశిష్టతను భక్తులకు వేద పండితులు వివరించారు.
భక్తుల కోసం తీర్థప్రసాదాలను...
వేలాది మంది వచ్చిన భక్తుల కోసం లడ్డూల కోసం తొమ్మిది ప్రాంతాల్లో ఎనభై ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మూడు లక్షల లడ్డూలతో పాటు ఐదు లక్షల తలంబ్రాలను సిద్ధం చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద యెత్తున ఏర్పాట్లు చేశారు. అలాగే భద్రాచలంలో జరుగుతున్న సీతారామ కల్యాణాన్ని లైవ్ లో లక్షలాది మంది తిలకించి తరించారు. సీతారాముల కల్యాణానికి వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలను ఉచితంగా అందచేసిన అర్చక స్వాములు..వారికి తీర్థ ప్రసాదాలను అందచేశారు. రేపు శ్రీరాముడి పట్టాభిషేకం జరగనుంది.
















Tags:    

Similar News