నెల్లూరు ఇన్‌ఛార్జి ఫిక్స్.. కోటంరెడ్డిని రీప్లేస్ చేసేది ఈయనే

నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని హైకమాండ్ నియమించే అవకాశాలున్నాయి

Update: 2023-02-01 07:16 GMT

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగంగా పార్టీపైన, ప్రభుత్వంపైన విమర్శలు చేయడంతో పార్టీ చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యమంత్రి జగన్ మధ్యాహ్నం నెల్లూరు అంశంపై నేతలతో మాట్లాడనున్నారు. టీడీపీ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాతనే కోటంరెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, మంత్రి పదవి రాలేదన్న అక్కసుతో ఆయన పార్టీని వీడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారని వైసీపీ హైకమాండ్ అభిప్రాయపడుతుంది.

పదిహేను నెలల సమయం...
ఈ నేపథ్యంలో మరో పదిహేను నెలలు ఎన్నికలకు సమయం ఉంది. కోటంరెడ్డి ఇప్పటికే తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని క్యాడర్ తో చెప్పారు. ఈ విషయం తెలిసిన అధిష్టానం బలమైన నేతకు పార్టీ ఇన్‌చార్జి పదవిని అప్పగించే యోచనలో ఉంది. అందులో మొదటగా నెల్లూరు పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇన్‌ఛార్జి పదవి అప్పగించే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉందని చెబుతున్నారు. మధ్యాహ్నం జగన్ తో సమావేశం పూర్తయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును హైకమాండ్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆదాలకు మాత్రమే...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఢీకొట్టే నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రమేనని పార్టీ భావిస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ జరిగిన మూడు ఎన్నికల్లోనూ రెడ్డి సామాజికవర్గం నేతలే విజయం సాధించారు. రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి పట్టుంది. అక్కడ టీడీపీ ఓటు బ్యాంకు తక్కువే. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ టీడీపీ అక్కడ గెలవలేదు. 2009లో ఆనం వివేకానందరెడ్డి రూరల్ నుంచి విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిచారు. ఈ నేపథ్యంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే సరైన అభ్యర్థి అని జగన్ సయితం భావిస్తున్నారు.
మేకపాటికి ఇస్తారా?
దీంతో పాటు నెల్లూరు లోక్‌సభ పరిధిలో ఎటూ వైసీపీ బలంగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుకు ఎవరినో ఒకరిన పోటీ చేయించవచ్చు. అది పెద్దగా ఇబ్బంది ఉండదు. అవసరమైతే మేకపాటి రాజమోహన్ రెడ్డిని బరిలోకి దించొచ్చు. ఆయన ఇప్పటికే ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించారు. ఎంపీ అభ్యర్థులకు కొరత లేదు. కానీ రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితేనే కోటంరెడ్డిని ధీటుగా ఎదుర్కొంటారని విశ్వసిస్తున్నారు. ఈ పదిహేను నెలల కాలంలో ప్రజల వద్దకు వెళ్లి చేరువయ్యే సమయం ఉండటంతో ఆదాలకు పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. నెల్లూరు రూరల్ వైసీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నియామకం దాదాపు ఖాయంగానే తెలుస్తోంది.


Tags:    

Similar News