భారతీయులకు H-1B వీసాల వాటా తగ్గుదల

భారతీయులకు జారీ చేసే H-1B వీసాల వాటా గత రెండు సంవత్సరాల్లో తగ్గిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ

Update: 2025-10-05 10:03 GMT

H-1B visas for Indians fall sharply in two years ILO

హైదరాబాద్‌: భారతీయులకు జారీ చేసే H-1B వీసాల వాటా గత రెండు సంవత్సరాల్లో తగ్గిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), ఆర్థిక సహకారం అభివృద్ధి సంస్థ (OECD) మరియు ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.

భారతీయులు ఇప్పటికీ H-1B వీసాలు పొందే వారిలో మెజారిటీగానే ఉన్నా, వారి వాటా 2022లో 80% నుంచి 2024లో 67%కి పడిపోయిందని పేర్కొంది. ఇదే సమయంలో చైనాకు చెందిన దరఖాస్తుదారుల వాటా 14% పెరిగిందని నివేదికలో చెప్పింది.

ఆసియాలోని కార్మిక వలస ధోరణులను పరిశీలించిన ఈ నివేదికలో విదేశీ ఉద్యోగాల నియామక ప్రక్రియ పారదర్శకంగా, సమానంగా ఉండాలని సూచించింది. “విదేశాల్లో ఉపాధి పొందే ప్రక్రియ న్యాయంగా, పారదర్శకంగా ఉండాలి. కార్మికులకు తగిన శిక్షణ, ఒప్పందాలు ఇవ్వాలి. తక్కువ నైపుణ్యం గల కార్మికులను అక్రమంగా నియమించే చర్యలను అరికట్టాలి” అని పేర్కొంది.

గల్ఫ్ దేశాలకు వలస పెరిగింది

ఆసియా దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస 7% పెరిగిందని, ముఖ్యంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో 2024లో 56% పెరుగుదల నమోదైందని నివేదిక తెలిపింది. అంతర్జాతీయ వలసదారుల సంఖ్యలో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది.

2024లో సుమారు 3.77 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారని, కతార్‌, కువైట్‌, సౌదీ అరేబియాలకు వెళ్లిన వారి సంఖ్య తగ్గినా యూఏఈ, ఒమాన్‌, బహ్రెయిన్‌ దేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్య పెరిగిందని వెల్లడించింది. ఇదే సమయంలో ఇండోనేషియా, నేపాల్‌, శ్రీలంక నుంచి గల్ఫ్‌కు వెళ్లిన వారి సంఖ్య రెండింతలు పెరిగిందని తెలిపింది.

యూరప్‌, ఇతర దేశాలు

యూరోపియన్‌ యూనియన్‌లో భారతీయులకు బ్లూ కార్డులు జారీ 2023లో 7% పెరిగిందని నివేదిక పేర్కొంది. OECD సభ్యదేశాలు (38) మొత్తంగా తీసుకున్నప్పుడు వలసదారుల సంఖ్య 2000లో 19.70 లక్షల నుంచి 2015–16 నాటికి 48.25 లక్షలకు చేరిందని తెలిపింది.

2022లో అమెరికాలో సుమారు 1.5 లక్షల భారతీయ విద్యార్థులు చదువుతున్నారని, బ్రిటన్‌లో 1.26 లక్షలు, కెనడాలో 1.04 లక్షలు ఉన్నారని పేర్కొంది. అయితే 2024లో యూకేలో ఆసియా దేశాలకు ఇచ్చిన ఉద్యోగ వీసాలు 1.48 లక్షల నుంచి 90 వేలకే తగ్గాయని, వాటిలో భారత వాటా 53%కి పడిపోయిందని తెలిపింది. అయినప్పటికీ హెల్త్‌కేర్‌ విభాగంలో భారతీయుల వాటా 27%గా కొనసాగిందని తెలిపింది.

కెనడాలో ఆసియా దేశాల నుంచి శాశ్వత నివాసానికి వెళ్తున్న వారి వాటా 2015లో 60% ఉండగా 2024లో 56%కి తగ్గిందని, కానీ తాత్కాలిక ఉద్యోగాల కార్యక్రమంలో భారతీయుల సంఖ్య పెరిగిందని నివేదిక తెలిపింది.

ఆస్ట్రేలియా 2024లో ఇచ్చిన తాత్కాలిక నైపుణ్య వీసాలలో 21% భారతీయులకే జారీ చేయడం గమనార్హమని తెలిపింది.

Tags:    

Similar News