నేషనల్ హైవేపైకి కారు.. గేరు మార్చింది అందుకే

బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తొలిసారి మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ పోటీ చేయనుంది.

Update: 2022-10-05 11:14 GMT

బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తొలిసారి మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ పోటీ చేయనుంది. గుర్తు కారు ఉంటుంది కాబట్టి ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం లేదు. ఇప్పటికే టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీని తీసుకుని ఆ పార్టీకి చెందిన ఒక బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ తో సమావేశం కానుంది. వారికి పార్టీ చేసిన తీర్మానాలను అందచేయనుంది. ఎన్నికల కమిషన్ ఆదేశంతో బీఆర్ఎస్ గా మారనుంది.

తొలి పోటీ అక్కడి నుంచే...
మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుపైనే పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని కేసీఆర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇటీవల గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలాతో కేసీఆర్ భేటీ అయ్యారు. శంకర్ సింగ్ వాఘేలా, ఎంఐఎంతో కలసి గుజరాత్ తో బీఆర్ఎస్ పోటీ చేయనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కనీస స్థానాలను తొలి ప్రయత్నంలో ఇతర రాష్ట్రంలో సాధించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు.
గుజరాత్ లోనూ...
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రంలో తొలుత కాలుమోపాలని కేసీఆర్ భావిస్తున్నారు. తన అంచనాలు నిజమైతే కొన్ని సీట్లు సాధించవచ్చని, అక్కడ ఎన్నికల అనంతరం బీజేపీయేతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్న వ్యూహంలో కూడా కేసీఆర్ ఉన్నారని సమాచారం. ఇక తర్వాత కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా జరగబోయే ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేసే అవకాశాలున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ఆయా ప్రాంత ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అందుకోసమే అక్కడ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ ను బరిలోకి దించాలన్న యత్నంలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది.
ఏపీలో పోటీకి...
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా 2024లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కూడా పోటీ చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కేసీఆర్ కు ఏపీలో కూడా అభిమానులున్నారు. అక్కడ కూడా తెలంగాణ మాదిరి అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే బీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలన్న లక్ష్యంతో ఉన్నారు. లోక్ సభ ఎన్నికలపై ప్రధానంగా ఫోకస్ పెట్టి వివిధ రాష్ట్రాల్లో కనీస స్థానాలను సాధించుకుని జాతీయ పార్టీగా నిలదొక్కుకోవాలన్న ప్రయత్నమయితే కేసీఆర్ చేయనున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంత మేరకు సఫలం అవుతాయన్నది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.


Tags:    

Similar News