ఏపీలో పీకే ఈసారి ప్లానేంటి?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు రానున్న ఏపీ ఎన్నికలు ఒక సవాల్ అని చెప్పాలి.

Update: 2022-03-18 04:38 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు రానున్న ఏపీ ఎన్నికలు ఒక సవాల్ అని చెప్పాలి. ఏపీలో తిరిగి వైసీపీని ఒడ్డున పడేస్తే పీకే కు ఇక తిరుగులేనట్లే. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. 2019లో ఆంధ్ర్రప్రదేశ్ లో వైసీపీని, ఆ తర్వాత ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ను మూడోసారి, పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీని మూడోసారి, తమిళనాడులో స్టాలిన్ ను ఆయన గెలిపించారు. ఢిల్లీ, బెంగాల్ లో అక్కడ మూడోసారి ఆ పార్టీలను గెలిపించి ప్రశాంత్ కిషోర్ నిజంగానే దేశ రాజకీయాల్లో రికార్డు సృష్టించారు. తెలంగాణలో మూడోసారి కేసీఆర్ ను అధికారంలోకి తెచ్చేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.

ఆ ఎన్నికలు వేరు....
వరసగా మూడోసారి గెలిపించడమంటే ఆషామాషీ కాదు. అయినా పీకే విజయం సాధించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత్ కిషోర్ రెండోసారి జగన్ కు విజయం దక్కేలా వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. 2019 ఎన్నికలు వేరు. 2024 ఎన్నికలు వేరు. అప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నారు. జగన్ సంక్షేమ పథకాల్లో ముందున్నా, అభివృద్దిలో మాత్రం వెనకబడి ఉన్నారన్నది వాస్తవం. కొంత యువతలో నైరాశ్యం కన్పిస్తుంది.
రాజకీయ పరిణామాల....
మరోవైపు ఏపీ రాజకీయ పరిణామాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, కమ్యునిస్టులు కలిసి ఈసారి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. పవన్ కల్యాణ్ సయితం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఈసారి అందరినీ ఏకం చేస్తామని చెప్పారు. ఇదే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కు సవాల్ గా మారనుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చగలగాలి. విపక్షాలను ఏకం చేయకూడదు. ఢిల్లీ, బెంగాల్ లోనూ ఇదే తరహా వ్యూహాన్ని ప్రశాంత్ కిషోర్ రచించారు.
ఆ తరహా వ్యూహం....
అయితే ఇప్పుడు ఏపీలో ఆ తరహా వ్యూహం సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్న. ప్రధానంగా బలమైన కాపు సామాజికవర్గం ఓట్ల చీల్చడం తో పాటు మరో ప్రధాన సామాజికవర్గం బీసీలను వైసీపీకి మరింత చేరువ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయనకు సర్వాధికారాలు ఉండటంతో ఆ దిశగా కూడా కొంత ప్రజలను వైసీపీ వైపు మళ్లించే ప్రయత్నం చేయవచ్చు. కానీ గత ఎన్నికలంత సులువు కాదు ఈసారి. రెండోసారి జగన్ ను, మూడోసారి కేసీఆర్ ను ప్రశాంత్ కిషోర్ అధికారంలోకి ఎలా తేగలరన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News