పాపం.. కోమటిరెడ్డి... అంతా భ్రాంతియేనా?

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమితో బీజేపీకి పార్టీ పరంగా ఎలాంటి నష్టం లేదు. నష్టం.. కష్టమంటూ ఉంటే అది కోమటిరెడ్డికే.

Update: 2022-11-06 11:54 GMT

భారతీయ జనతా పార్టీ మునుగోడు బరిలో నిల్చుని తప్పు చేసిందా? రాజీనామా చేయించి మరీ కోరి ఎన్నికలు తెచ్చుకుని ఓటమి పాలయిన బీజేపీ ఏం సాధించింది? అనవసరంగా సాధారణ ఎన్నికలకు ముందు లేనిపోని తలనొప్పులు తెచ్చుకుందా? అంటే ఒకరకంగా అవునని చెప్పాలి. మరో రకంగా కాదని చెప్పాలి. మునుగోడులో ఓటమి వల్ల బీజేపీకి పెద్దగా కోల్పోయేదేమీ లేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు ముచ్చటగానే ఉంటారు. రాజాసింగ్ పై నేడో, మాపో సస్పెన్షన్ కూడా ఎత్తివేస్తుంది. ముగ్గురి ఎమ్మెల్యేలతో ఈ పదమూడు నెలలు నెట్టుకొస్తుంది.

సొమ్ము ఆయనది...
కానీ సాధారణ ఎన్నికలకు ముందు ఇంత ఖర్చు పెట్టడం, ఇంత హంగామా సృష్టించడం, ఇన్ని సవాళ్లు విసరడం అవసరమా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఎందుకంటే ఓడిపోతామని తెలిసి భారతీయ జనతా పార్టీ రాజీనామా చేయించి ఉండదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాబట్టి రాజీనామా చేయించి బరిలోకి దింపింది. ఆయనకు గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేసి ఉండవచ్చు. సొమ్ము ఆయనది. సోకు మనది అనుకుని ఉండొచ్చు. రాష్ట్రంలో ఎన్నికల హీట్ ను ఇప్పటి నుంచే రగిలించి ఉండాలనుకోవచ్చు. ఆ హీట్ ను కొనసాగించగలిగే తమకు భవిష్యత్ లో లాభం ఉంటుందని భావించి ఉండవచ్చు.
బీజేపీకి జరిగే నష్టం...
ఇప్పుడు ఓటమి పాలయినంత మాత్రాన బీజేపీకి జరిగే నష్టం ఇసుమంత కూడా లేదు. పైగా రెండో స్థానంలోకి రావడంతో తామే అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని మాత్రం బలంగా చెప్పుకోగలిగింది. ఎందుకంటే కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ లో తాము రెండో స్థానంలోకి వచ్చామని చెప్పుకునే వీలు దొరికింది. కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. నల్లగొండ జిల్లాలో పట్టుకు ఈ ఎన్నిక పార్టీకి బాగానే ఉపయోగపడింది. నాగార్జున సాగర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ కన్పించలేదు. అందుకే నల్లగొండ జిల్లాలో బలం పెంచుకోవడానికి, పట్టు మరింత బిగించడానికి బరిలో దిగిందన్నది వాస్తవం.
కుమ్మరించినా.. కోమటిరెడ్డి...
ఈ ఓటమితో బీజేపీకి పార్టీ పరంగా ఎలాంటి నష్టం లేదు. నష్టం.. కష్టమంటూ ఉంటే అది కోమటిరెడ్డికే. ఎందుకంటే వందల కోట్లు కుమ్మరించినా తనను ప్రజలు ఆదరించలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు నల్లగొండ జిల్లాలో ఉన్న గ్రిప్ సడలిందన్న కామెంట్స్ ఇకపై వినిపించక మానవు. పార్టీకి పోయేదేముంటుంది. జెండాల ఖర్చు తప్ప. అందుకే ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే.. మునుగోడు ఉప ఎన్నికతో కాంగ్రెస్ ను బీజేపీ పక్కకు నెట్టగలిగింది. సెకండ్ ప్లేస్ ఇప్పటికి తమదేనని చెప్పుకునేందుకు, జబ్బలు చరచుకునేందుకు ఒక అవకాశం దక్కింది. కోమటిరెడ్డికి మాత్రం... ఏం చెప్తాం.. మీరే ఆలోచించుకోండి.


Tags:    

Similar News