మునుగోడులో కాంగ్రెస్ పుంజుకుందా... రీజన్లు ఇవేనా?

మునుగోడులో కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ టీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ సవాల్ విసురుతుంది

Update: 2022-10-29 03:34 GMT

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా? కొన్ని సర్వేలు అవే చెబుతున్నాయి. చాణక్య నిర్వహించిన సర్వేలోనూ కాంగ్రెస్ రెండో స్థానంలోకి వచ్చింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య కేవలం ఐదు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వేల ఫలితాలు చూసి కాంగ్రెస్ నేతల్లో సంబరాలు మొదలయ్యాయి. ప్రధానంగా ఏడాది మాత్రమే సమయం ఉండటంతో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఒక్కసారి అవకాశం ఇస్తే పోలా? అన్న ధోరణి మునుగోడు ప్రజల్లో బయలుదేరిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ట్రాక్ రికార్డు చూసినా...
ఇటు ట్రాక్ రికార్డు చూసినా కాంగ్రెస్ కు మునుగోడులో ఎప్పుడూ ఆదరణ ఉంది. ఆరుసార్లు విజయం సాధించిన ఘనత కాంగ్రెస్ కు ఉంది. పైగా పాల్వాయి గోవర్థన్ రెడ్డి బిడ్డ కావడం కూడా స్రవంతికి అదనపు బలంగా కనిపిస్తుందంటున్నారు. గోవర్థన్ రెడ్డికి నియోజకవర్గంలో ఇప్పటికీ మంచి పేరుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోయినా కాంగ్రెస్ ఓటు బ్యాంకు మాత్రం స్థిరంగా ఉందన్న విశ్వాసం నేతల్లో గత రెండు మూడు రోజుల నుంచి మరింత పెరుగుతుంది. ధనం, మద్యం విచ్చలవిడిగా పంచుతున్నా తమ పార్టీ అభ్యర్థి పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారన్న నమ్మకంతో కాంగ్రెస్ ఉంది.
ఆడియో లీకులు...
దీంతో పాటు ఆడియో లీకులు కూడా కాంగ్రెస్ కు లబ్ది చేకూర్చే విధంగా ఉన్నాయి. పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సోదరుడికి ఓటు వేయాలని చెప్పిన ఆడియో కూడా కాంగ్రెస్ కు అదనంగా ప్రయోజనమయిందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కోవర్టు ఆపరేషన్ చేస్తున్న బ్రదర్స్ పట్ల విముఖత పెరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. పాల్వాయి స్రవంతి వైపు మహిళ ఓటర్లు మొగ్గు చూపుతున్నారని, ఆమెపై సానుభూతి కూడా పెరుగుతుందని అంటున్నారు.
రాహుల్ జోడో యాత్ర....
ఇక రెండు రోజుల నుంచి మొయినాబాద్ ఫాంహౌస్ లో జరుగుతున్న ఎమ్మెల్యే కొనుగోలు అంశం కూడా తమకు లాభిస్తుందన్నారు. రెండు పార్టీలపైనా ఇప్పటి వరకూ ఉన్న భ్రమలు తొలగిపోయాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రెండు పార్టీలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వాళ్లేనని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారంటున్నారు. దీనికి తోడు రాహుల్ భారత్ జోడో యాత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి అడిషనల్ గా కొంత బలం చేకూరిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రాహుల్ కష్టం కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తాయన్న ఆశాభావంతో కాంగ్రెస్ ఉంది. మరి చివరి నిమిషంలో ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News