జగన్ ను బతకనివ్వరట

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉందా? ఆయనను ఎవరు టార్గెట్ చేశారు? ఇదీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్

Update: 2021-12-13 08:20 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉందా? ఆయనను ఎవరు టార్గెట్ చేశారు? ఇదీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. ముఖ్యమంత్రి జగన్ కు ప్రాణహాని ఉందని, ఆయనను హత్య చేయడానికి కుట్ర జరుగుతుందంటూ వైసీపీ నేతలే ఆరోపిస్తున్నారు. మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డిలు ఈ కామెంట్స్ చేయడంతో ఏపీ రాజకీయాల్లో మరోసారి కాక రేపాయి.

టీడీపీ నేతలు....
జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతలను టార్గెట్ చేశారు. వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలోనే ఉన్నారు. టీడీపీని పూర్తిగా బలహీనం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అదే జగన్ కు ఇబ్బందిగా మారిందన్నది వైసీపీ నేతల ఆరోపణ, మొన్నామధ్య తిరుపతిలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా వైసీపీ నేతలు ఉటంకిస్తున్నారు. గాల్లోనే జగన్ కలసి పోతాడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దీనికి చుడుతున్నారు.
చంద్రబాబుతో డేంజర్....
జగన్ ఉంటే ఇక తాము అధికారంలోకి రాలేమని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ హత్యకు కుట్రపన్నారని మంత్రి నారాయణస్వామి తీవ్ర స్థాయిలోనే ఆరోపణలు చేశారు. అందుకే జగన్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లేకుంటే చంద్రబాబు ఏదైనా చేయగలిగిన సమర్థుడని, రాజకీయం కోసం ఆయన గతంలో చేసిన హత్యారాజకీయాలను కూడా వారు ప్రస్తావించారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
కోడికత్తికి, గొడ్డలికి సాన...
ప్రస్తుతమున్న సమస్యల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఈ కామెంట్స్ ను వైసీపీ నేతలు చేస్తున్నారన్నారు. మరో కోడికత్తి, బాబాయ్ గొడ్డలి వేటు డ్రామాకు వైైసీపీ తెరతీసిందని సీనియిర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. మళ్లీ కోడికత్తికి, గొడ్డలికి సాన పెడుతన్నట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. బాబాయ్ ని చంపిందెవరో చెప్పకుండా ఈ డ్రామాలు కట్టిపెట్టాలని ఆయన కోరారు. మొత్తం మీద జగన్ ను బతకనివ్వరంటూ వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ మరోసారి ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.


Tags:    

Similar News