Shivaji : ఛత్రపతి శివాజీ కథ తెలుసు.. ఆయన వీర 'కుక్క' కథ తెలుసా..!

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గురించిన కథలు అందరికి తెలుసు. కానీ ఆయన వీర పెంపుడు కుక్క 'వాఘ్య' గురించి ఎంతమందికి తెలుసు.

Update: 2024-02-20 12:18 GMT
Shivaji : మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొఘలుల పై శివాజీ చేసిన యుద్దాలు భారతదేశ చరిత్రలో వీరగాధలగా నిలిచిపోయాయి. శివాజీ చేసిన పోరాటాలు గురించి ఎన్నో కథలు మన స్కూల్ పాఠాల్లో కూడా వింటుంటాము. అయితే శివాజీ వెనుకే ఒక కుక్క కూడా ఆ పోరాటాల్లో పాల్గొనేది అనే కథని ఎక్కడా విని ఉండరు. ఫిబ్రవరి 19న శివాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి సంబందించిన ఎన్నో కథలు నెట్టింట వైరల్ అవుతుంటాయి.
అలా వైరల్ అవుతున్న ఓ కథ శివాజీ వీర పెంపుడు కుక్క 'వాఘ్య' (Waghya). ఈ పేరుకి అర్ధం ఏంటంటే.. మరాఠీలో పులి అని అర్ధం. శివాజీ పెంపుడు కుక్క అయిన ఈ వాఘ్య.. ఆయనతో పాటు ఎన్నో యుద్ధ పోరాటాల్లో పాల్గొందట. శివాజి పట్ల ఈ కుక్క ఎంతో విధేయత, విశ్వాసం, ప్రేమ కలిగి ఉండేదట. ఇక ఈ ప్రేమతోనే శివాజీ మరణించిన తరువాత.. ఆయన అంత్యక్రియల సమయంలో ఆయన చితిలోకి దూకి తనను తాను సజీవ దహనం చేసుకుందట.
ఇక యజమాని పై ఆ కుక్క చూపించిన విశ్వాసానికి రూపంగా.. రాయ్‌గఢ్ కోటలో శివాజీ మహారాజ్ సమాధి పక్కన ఒక పీఠంపై వాఘ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1930లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ కుక్కకి సంబంధించిన కథలకు చరిత్రలో ఎటువంటి ఆధారాలు లేవని 2011లో వాఘ్య విగ్రహాన్ని కొందరు తొలిగించారట. కానీ తరువాత మళ్ళీ దానిని అక్కడే ప్రతిష్ఠించారట. మరి ఈ కుక్కకి సంబంధించిన కథలో ఎంత నిజముందో తెలియదు గాని, మరాఠా ప్రజల్లో చాలామంది దీనిని నమ్ముతుంటారని చెబుతున్నారు.
Tags:    

Similar News