బాండీ కాల్పులకు పాల్పడింది తండ్రీకొడుకులే
ఆస్ట్రేలియాలో నిన్న బాండీ బీచ్ వద్ద కాల్పులకు పాల్పడింది తండ్రీకొడుకులేనని పోలీసులు వెల్లడించారు.
ఆస్ట్రేలియాలో నిన్న బాండీ బీచ్ వద్ద కాల్పులకు పాల్పడింది తండ్రీకొడుకులేనని పోలీసులు వెల్లడించారు. వీరిలో తండ్రి సాజిద్ అక్రమ్మరణించినట్లు తెలిపారు. అతడి కొడుకు నవీద్ అక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో వాడిన ఆయుధాలకు సాజిద్ వద్ద లైసెన్స్ ఉందని చెప్పారు. ఈ దాడిలో మరణాల సంఖ్య 16కు చేరింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండి బీచ్‌లో హనుక్కా పండుగ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో ఒక అనుమానితుడిపై ఆరుగేళ్ల కిందటే భద్రతా సంస్థలు దృష్టి పెట్టినట్టు జాతీయ ప్రసార సంస్థ వెల్లడించింది. ఆదివారం జరిగిన ఈ కాల్పుల్లో 16 మంది మృతి చెందగా, 40 మందికిపైగా గాయపడ్డారు.
ఇద్దరినీ...
ఆస్ట్రేలియా మీడియా కథనాల ప్రకారం, కాల్పులు జరిపిన వారిగా 50 ఏళ్ల సాజిద్ అక్రం, అతడి 24 ఏళ్ల కుమారుడు నవీద్ అక్రంలుగా పోలీసులు గుర్తించారు. పోలీసులతో ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్రం అక్కడికక్కడే మృతి చెందాడు. నవీద్ అక్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, పోలీసు పహారాలో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ 2019లో నవీద్ అక్రంపై విచారణ జరిపింది. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఓ సభ్యుడితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అప్పట్లో అనుమానం వ్యక్తమైంది. ఆ సభ్యుడిని 2019 జూలైలో అరెస్టు చేసి, ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి సిద్ధమయ్యాడన్న ఆరోపణలపై శిక్ష విధించారు.
ధైర్యంగా ఎదిరించి...
బాండి బీచ్ కాల్పుల్లో పాల్గొన్న ఇద్దరూ ఇస్లామిక్ స్టేట్‌కు విధేయత ప్రకటించినట్టు కౌంటర్ టెర్రరిజం అధికారులు అనుమానిస్తున్నారని ఏబీసీ తెలిపింది. ఘటన స్థలానికి సమీపంలో వారి కారులో రెండు ఐఎస్ జెండాలు లభించినట్టు సీనియర్ అధికారులు వెల్లడించినట్టు పేర్కొంది. ఈ దాడిలో సమర్థవంతంగా ఉగ్రవాదిని ఎదుర్కొన్న అస్లాంను అందరూ అభినందిస్తున్నారు. అతను పండ్ల వ్యాపారి అని, ధైర్యసాహసాలతో ఉగ్రవాదులను అడ్డుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతను కూడా ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నాడు. ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కున్న అతని ధైర్య సాహసాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రశంసించారు.