Delhi : భయపెడుతున్న ఢిల్లీ.. వెళ్లారా..ఇబ్బందిపడినట్లే
ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రమయింది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాయుకాలుష్యం కూడా పెరుగుతుంది
ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రమయింది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాయుకాలుష్యం కూడా పెరుగుతుంది. ఒక రకంగా ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ లా మారింది. ఇప్పటికే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లు దాటేసింది. కొన్ని హాట్ స్పాట్ లలో ఐదు వందల పాయింట్లు నమోదవుతున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ లో విజిబిలిటీ కూడా తగ్గింది. డిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. గ్రాఫ్ 4 చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఢిల్లీలో బహిరంగ క్రీడలపై వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశించింది. మరొకవైపు బయటకు వచ్చే వారంతా తగిన జాగ్రత్తలు తీసుకుని రావాలని వైద్యులు సూచిస్తున్నారు.
క్రీడలు నిలిపివేయాలని...
ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 461కి చేరింది. ఈ పరిస్థితుల్లో బహిరంగంగా నిర్వహించే శారీరక క్రీడా కార్యకలాపాలన్నింటినీ వెంటనే నిలిపివేయాలని గాలినాణ్యత నిర్వహణ కమిషన్ ఎన్‌సీఆర్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నవంబర్ 19న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికే సూచనలు జారీ చేసినప్పటికీ, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కొన్ని పాఠశాలలు, సంస్థలు ఇంకా బహిరంగ క్రీడలు నిర్వహిస్తున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే పిల్లల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించింది. ప్రతికూల గాలి నాణ్యత సమయంలో బహిరంగ శారీరక కార్యకలాపాలు కొనసాగించడం సుప్రీంకోర్టు ఆదేశాల ఉద్దేశానికి, కమిషన్ సూచనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
సంపన్నులు మాత్రం...
మరొకవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంతో ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించి బయటకు రావాలని కోరుతున్నారు. డబ్బున్న వారు డబ్బు పెట్టి ఆక్సిజన్ కొనుగోలు చేసుకుని బతుకుతున్నారు. కానీ పేద, మధ్యతరగతి, వేతన జీవులు మాత్రం ఢిల్లీ కాలుష్యం బారినపడి అస్వస్థతకు గురవుతున్నారు. ఆపరేషన్ క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా రోడ్ల నిర్వహణలో లోపాలు, పునరావృత నిర్లక్ష్యంపై ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీపై కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తనిఖీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో అధిక ధూళి, చెత్త పేరుకుపోవడం, చెత్త కాల్చిన ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. ఢిల్లీకి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా తగ్గిందని అంటున్నారు. వాయు కాలుష్యం గతం కంటే ఢిల్లీ వాసులను ఇబ్బందులకు గురి చేస్తుంది.