కరెంట్ ఛార్జీల పెంపుపై బండి సంజయ్ ఫైర్.. రేపు ఆందోళనలు !

టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడిందన్నారు. కరోనాతో కుదేలై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై

Update: 2022-03-24 11:13 GMT

హైదరాబాద్ : తెలంగాణలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచనున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడిందన్నారు. కరోనాతో కుదేలై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై కరెంట్ ఛార్జీల పెంపుతో మోయలేని భారాన్ని మోపి పేదల నడ్డి విరుస్తోందంటూ సంజయ్ విరుచుకుపడ్డారు. కరెంట్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏకంగా 6 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం దారుణమని ఆరోపించారు. ఈ మేరకు బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు.

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క‌రెంటు ఛార్జీల పెంపుపై ఆందోళ‌న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులను వసూలు చేయడం చేతగాని ప్రభుత్వం.. ఆ భారాన్ని సామాన్యులపై మోపడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు. అలాగే డిస్కంలకు వినియోగదారులు చెల్లించాల్సిన కరెంట్‌ బకాయిలు రూ.17 వేల కోట్లుండగా.. అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలే రూ. 12,598 కోట్లు ఉన్నాయన్నారు. వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ. 4603 కోట్లు కాగా.. అందులో అత్యధికంగా పాతబస్తీకి చెందినవే ఉన్నాయని పేర్కొన్నారు.


Tags:    

Similar News