మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధం వారం రోజులు దాటుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు రష్యా సైనిక సమాచారం ఇచ్చినా పెద్దగా ప్రభావం ఉండదని అన్నారు. కువైట్‌లో డ్రోన్ దాడిలో మరణించిన ఆరు మంది అమెరికా ఆర్మీ రిజర్విస్టులకు నిర్వహించిన గౌరవ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ కార్యక్రమం అమెరికా–ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిన మరుసటి రోజే జరిగిన దాడికి సంబంధించినది. అమెరికా గూఢచారి సంస్థల అంచనా ప్రకారం, ఇరాన్‌కు లక్ష్యాలపై సమాచారం అందించడంలో రష్యా సహాయం చేస్తోందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఈ నివేదికలను ట్రంప్ పూర్తిగా ధృవీకరించలేదు. అయితే అలాంటి సమాచారం ఇస్తున్నా ఇరాన్‌కు పెద్దగా ఉపయోగం ఉండదని అన్నారు.
ఎలాంటి సమాచారం ఇచ్చినా...
“గత వారం ఇరాన్ పరిస్థితి చూస్తే, వాళ్లకు ఎలాంటి సమాచారం వచ్చినా పెద్దగా ఉపయోగపడట్లేదు” అని ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మియామీకి వెళ్తూ జర్నలిస్టులతో అన్నారు. రష్యా ఇరాన్‌కు సహాయం చేస్తే అమెరికా–రష్యా సంబంధాలపై ప్రభావం ఉంటుందా అన్న ప్రశ్నకు కూడా ఆయన పెద్దగా స్పందించలేదు. “మనం కూడా వాళ్లపై అదే చేస్తామని వాళ్లు చెబుతారు కదా” అని సమాధానమిచ్చారు. రష్యా దాడి ప్రారంభించిన తర్వాత నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌కు అమెరికా గూఢచారి సమాచారం అందిస్తోంది. రష్యా క్షిపణి దాడులను ఎదుర్కోవడం, కొన్ని లక్ష్యాలపై ప్రతిదాడి చేయడంలో ఆ సమాచారం సహాయపడింది.
భారత్‌కు తాత్కాలిక మినహాయింపుపై...
ఇదిలా ఉండగా, అమెరికా ఆర్థిక శాఖ ఈ వారం భారత్‌కు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. ఏప్రిల్ 4 వరకు రష్యా నుంచి ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై అమెరికాలో రెండు పార్టీల నేతలు విమర్శలు చేశారు. దీంతో రష్యాకు యుద్ధానికి అవసరమైన ఆదాయం వస్తుందని వారు ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి డాన్ బేకన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. “రష్యాపై బలహీన వైఖరి ఆందోళనకరం” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన టెడ్ లియూ కూడా ఇదే విషయాన్ని విమర్శించారు.
చమురు ధరలపై ఆందోళన...
ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి మార్గంగా రోజుకు సుమారు రెండు కోట్ల బ్యారెల్ల చమురు రవాణా అవుతుంది. ప్రస్తుతం అక్కడ నౌకలు సురక్షితంగా ప్రయాణించలేక పోతున్నాయి.మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రధాన చమురు, వాయు సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో సరఫరా అంతరాయం ఏర్పడింది. చమురు ధరలను తగ్గించేందుకు ఇతర చర్యలు తీసుకుంటారా అని అడిగితే ట్రంప్ స్పందించారు. “అలాంటి అవకాశం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఒత్తిడి కొంత తగ్గించేందుకు ప్రయత్నిస్తాం” అని చెప్పారు. అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వలను ఉపయోగించే ఆలోచనపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం అమెరికా వద్ద పెద్ద మొత్తంలో చమురు నిల్వలు ఉన్నాయని తెలిపారు. గత నెలాఖరుకు ఈ నిల్వలు సుమారు 415 మిలియన్ బ్యారెల్లకు చేరాయని వివరించారు.