పశ్చిమాసియాలో టెన్షన్ లు ఇంకా తగ్గలేదు. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఎనిమిదో రోజుకు చేరింది. అమెరికా సహకారంతో ఇజ్రాయిల్ ఇరాన్ పై యుద్ధం ప్రారంభించి ఎనమిది రోజులవుతున్నా ఇంకా ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తెల్లవారు జామున ఇజ్రాయిల్ ఇరాన్ బాంబు దాడులను ప్రారంభించింది. లెబనాన్ తూర్పు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో 41 మంది మరణించారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. సుమారు 40 ఏళ్లుగా గల్లంతైన నావిగేటర్ రాన్ అరాద్ గురించి సమాచారం కోసం ఈ దాడి చేపట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే ఆయన అవశేషాలు లేదా సంబంధిత ఆధారాలు దొరకలేదని వెల్లడించింది.
1986లో విమానం కూలిన తర్వాత...
1986లో లెబనాన్‌లో విమానం కూలిన తర్వాత రాన్ అరాద్ పారాచూట్ ద్వారా దిగారు. ఆ సమయంలో ఆయన పాలస్తీనా మిలిటెంట్లపై దాడుల్లో పాల్గొన్నారు. దిగిన వెంటనే స్థానిక గన్‌మెన్ ఆయనను సజీవంగా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ ఎక్కడ జరిగింది అన్నది ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించలేదు. అయితే లెబనాన్ సైన్యం, ప్రభుత్వ మీడియా వివరాల ప్రకారం సిరియా సరిహద్దు పర్వత ప్రాంతంలో ఇజ్రాయెల్ కమాండో దళాలు దిగాయి. అక్కడి నుంచి తూర్పు లెబనాన్‌లోని నబీ చిత్ పట్టణానికి చేరుకున్నాయి. అక్కడ హెజ్బొల్లా, స్థానిక యోధులతో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో నబీ చిత్ పరిసరాల్లో కనీసం 41 మంది మృతి చెందగా, 40 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాల్పుల్లు ముగ్గురు సైనికులు...
కాల్పుల్లో ముగ్గురు లెబనాన్ సైనికులు కూడా మరణించినట్టు లెబనాన్ సైన్యం వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో నాలుగు హెలికాప్టర్లు పాల్గొన్నాయని, వాటిలో రెండు దళాలను తుదముట్టించాయని తెలిపింది. ఇజ్రాయెల్ దళాలతో స్థానికులు కూడా ఎదురెదురయ్యారని, లెబనాన్ సైన్యం అప్రమత్తంగా ఉండి లైట్ బాంబులు పేల్చిందని పేర్కొంది. లెబనాన్ సైన్యాధిపతి జనరల్ రుడోల్ఫ్ హైకల్ మాట్లాడుతూ, ఈ ఆపరేషన్ నిర్వహించిన ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ సైన్యపు యూనిఫామ్‌లు ధరించాయని చెప్పారు. హెజ్బొల్లాకు చెందిన ఇస్లామిక్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తులు ఉన్న అంబులెన్సులను కూడా వాడినట్టు తెలిపారు. నబీ చిత్‌కు చెందిన ఓ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ దళాలు పట్టణంలోకి ప్రవేశించి ఒక సమాధిని తవ్వాయి. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాయి. భద్రతా కారణాల వల్ల అతను తన పేరు వెల్లడించలేదు.
అవశేషాలు దొరకలేదని...
ఇజ్రాయెల్ సైన్యం అరబిక్ ప్రతినిధి అవిచాయ్ అద్ఱాయీ ఎక్స్‌లో చేసిన పోస్టులో రాన్ అరాద్‌కు సంబంధించిన అవశేషాలు లేదా ఆధారాలు దొరకలేదని చెప్పారు.హెజ్బొల్లా సభ్యులు ఇజ్రాయెల్ దళాలతో ఘర్షణకు దిగినట్టు ఆ సంస్థ తెలిపింది. భూమిపై ఉన్న దళాలు వెనక్కి వెళ్లేందుకు అవకాశం కల్పించడానికి ఇజ్రాయెల్ వైమానిక దళం సుమారు 40 వైమానిక దాడులు నిర్వహించిందని పేర్కొంది. రాన్ అరాద్ భార్య టామీ అరాద్ మాత్రం తన భర్త మృతదేహం కోసం అన్వేషణలో ఇజ్రాయెల్ సైనికుల ప్రాణాలు ప్రమాదంలో పడకూడదని విజ్ఞప్తి చేశారు.“రాన్‌కు ఏమైందో తెలుసుకోవాలనే మా కోరిక ఇజ్రాయెల్ సైనికుల ప్రాణాలకు ముప్పు వస్తే అక్కడే ఆగిపోతుంది. 40 ఏళ్లుగా ఆయన గల్లంతయ్యారని తెలుసుకుని జీవిస్తున్నాం. ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నాం. కానీ ఏ మూల్యానికీ కాదు” అని ఆమె ఫేస్‌బుక్‌లో రాశారు. ఇజ్రాయెల్ దళాలకు ఈ ఆపరేషన్‌లో ఎలాంటి నష్టం జరగలేదని అవిచాయ్ అద్ఱాయీ తెలిపారు.
1986 నుంచి గల్లంతు...
1986లో అరాద్ దిగిన తర్వాత ‘బెలీవర్స్ రెసిస్టెన్స్’ అనే షియా ముస్లిం గుంపు అతన్ని పట్టుకుంది. ప్రారంభంలో అతని ఫోటోలు విడుదల చేశాయి. తర్వాత ఆయనకు సంబంధించిన సమాచారం పూర్తిగా నిలిచిపోయింది.1988 వరకు అతను నబీ చిత్‌లో ఉన్నాడని భావించారు. తర్వాత దక్షిణ లెబనాన్‌లోని మెయిదౌన్ గ్రామంలో హెజ్బొల్లా యోధులు, ఇజ్రాయెల్ సైనికుల మధ్య జరిగిన తీవ్ర పోరాటం తర్వాత అతని జాడ తెలియలేదు. గత డిసెంబరులో లెబనాన్‌కు చెందిన రిటైర్డ్ అధికారి అహ్మద్ షుక్ర్ తూర్పు లెబనాన్‌లో అదృశ్యమయ్యారు. భూమి కొనుగోలు విషయమై కొందరిని కలిసేందుకు వెళ్లిన సమయంలో ఆయన కనిపించకుండా పోయారు. రాన్ అరాద్ కేసులో సమాచారం కోసం ఇజ్రాయెల్ గూఢచారులు అతన్ని అపహరించి ఇజ్రాయెల్‌కు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అయితే అరాద్ పరిస్థితి గురించి షుక్ర్‌కు ఎలాంటి సమాచారం లేదని అతని భార్య, సోదరుడు ఇటీవల చెప్పారు.
గతంలో కూడా...
1994లో ఇజ్రాయెల్ కమాండోలు హెలికాప్టర్ల ద్వారా లెబనాన్ తూర్పు బెకా లోయలోకి వెళ్లి ‘బెలీవర్స్ రెసిస్టెన్స్’ నాయకుడు ముస్తఫా దిరానీని పట్టుకున్నారు. అతన్ని ఇజ్రాయెల్‌కు తీసుకెళ్లారు. హెజ్బొల్లాతో ఖైదీల మార్పిడి ఒప్పందం కింద 10 ఏళ్ల తర్వాత అతన్ని విడుదల చేశారు.2008లో హెజ్బొల్లా మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్‌కు ఒక నివేదిక పంపింది. అందులో అరాద్ తనను పట్టుకున్న వారి నుంచి తప్పించుకుని ఇజ్రాయెల్ చేరే ప్రయత్నంలో మరణించి ఉండవచ్చని సూచించింది. ఆ నివేదికను అప్పట్లో ఇజ్రాయెల్ మీడియా ప్రచురించింది.లెబనాన్ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు కొనసాగించింది. సోమవారం ప్రారంభమైన తాజా ఘర్షణల తర్వాత ఇవి మరింత పెరిగాయి.ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనేయి హత్యకు ప్రతీకారంగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్లు ప్రయోగించింది. ఈ ఘటన తర్వాత మధ్యప్రాచ్యంలో కొత్త యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.శనివారం ఉదయం దక్షిణ లెబనాన్‌లోని జవ్తర్ అల్ షార్కియా, అరబ్ సలీమ్, జిబ్‌చిత్ గ్రామాలపై వైమానిక దాడులు జరిగాయి. జిబ్‌చిత్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో సహా ఆరుగురు మృతి చెందారు. జవ్తర్ అల్ షార్కియాలో ఐదుగురు మరణించినట్టు ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది.