నరసాపురంలో నవ్వుల పాలు కాక తప్పదా?

ఆంధ్రప్రదేశ్ లో మరో ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఏడాది చివరలోనే ఉప ఎన్నికల జరిగే అవకాశముంది.

Update: 2022-01-16 08:19 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరో ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఏడాది చివరలోనే ఉప ఎన్నికల జరిగే అవకాశముంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వచ్చే నెల 5వ తేదీ తర్వాత రాజీనామా చేయనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో మార్చి 14వ తేదీ వరకూ జరగనున్నాయి. ఆ సమావేశాల తర్వాతనే బహుశ రఘురామ కృష్ణరాజు రాజీనామా ఉండవచ్చు. రాజీనామా చేసిన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఈ ఏడాది చివరిలోపు...
అంటే ఈ ఏడాది సెప్టంబరులోపుగా నరసాపురం పార్లమెంటుకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. రఘురామ కృష్ణరాజు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో డిసైడ్ అయ్యారు. రాజీనామా చేసిన వెంటనే ఆయన ఆ పార్టీలో చేరతారు. అందుకు రంగం కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వైసీపీయేతర పార్టీల సహకారం తీసుకోనున్నారు. వైసీపీ వర్సెస్ రఘురామ కృష్ణరాజులాగానే ఎన్నిక జరిగేలా ఆయన చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పెద్దగా ప్రయత్నం చేయకపోయినా?
రఘురామ కృష్ణరాజు పెద్దగా ప్రయత్నం చేయనక్కరలేదు. జగన్ కొమ్ములు వంచాలంటే ఈ ఎన్నికలో ఓడించాలి. అందుకే ఆయన అడగకపోయినా అన్ని పార్టీలూ మద్దతిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వైసీపీకి ఈ ఎన్నికలో నెగ్గుకు రావడం కష్టమే. ఇప్పటి వరకూ జరిగిన తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ సునాయాసంగా గెలిచింది. అయితే ఆ ఎన్నికల నేపథ్యం వేరు. ఈ ఎన్నిక వేరు. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ లుగా ఉన్న వారు మరణించారు. అక్కడ ప్రత్యర్థులకు కూడా పెద్దగా బలం లేదు. కానీ ఇక్కడ గత ఎన్నికల్లోనే వైసీపీకి పెద్దగా మెజారిటీ రాలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజుకు కేవలం 35 వేల ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు.
ఎవరు గెలిచినా..?
కానీ నరసాపురం అలా కాదు. అన్ని పార్టీలూ బలంగా ఉన్నాయి. ఇక్కడ సామాజికవర్గాల పరంగా చూసినా ప్రత్యర్థుల బలాన్ని తక్కువ అంచనా వేయలేం. క్షత్రియులు, కాపు సామాజికవర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇద్దరూ కలిస్తే వైసీపీకి విజయం కష్టమే. అందుకే లెక్కలు వేసుకుని మరీ రాజుగారు బరిగీశారు. జగన్ కు కూడా ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. తనను కాదని కాలుదువ్వి వెళ్లిన రాజు గెలిస్తే తన పరువు గోదారిలో కలవడం ఖాయం. ఈ ఎఫెక్ట్ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కనపడుతుంది. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు జగన్ కు పెద్ద పరీక్ష పెట్టారనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఇక జగన్ కు వచ్చే ఎన్నికల్లోనూ తిరుగులేనట్లే.


Tags:    

Similar News