అంతా మంచే జరుగుతుందా?

భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిన దారులన్నీ మూసుకుపోయాయి. ఇక ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు.

Update: 2023-05-14 07:35 GMT

భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిన దారులన్నీ మూసుకుపోయాయి. ఇక ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఇన్నాళ్లూ తెలంగాణలో కొద్దో గొప్పో ఆశలున్నప్పటికీ అది కూడా కర్ణాటక ఫలితాలతో గల్లంతయినట్లే. దీంతో దక్షిణాదిన నమ్మకమైన మిత్రులు మోదీకి అవసరం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని తేలిపోయింది. కర్ణాటక ఫలితాలు ఇప్పుడు బీజేపీ ఆలోచనను మార్చేస్తాయని కొందరు చెబుతున్నారు. వీలయితే ముందుగా పెట్టుకోవడం, లేదంటే ఎన్నికల అనంతరం తమకు నమ్మకమైన మద్దతుదారుకు అండగా నిలవడం.

టీడీపీతో నేరుగా పొత్తు...
మొదటి ఆప్షన్.. టీడీపీతో తిరిగి కలవడం. ఇది బీజేపీ కేంద్ర నాయకత్వానికి సుతారమూ ఇష్టం లేదు. చంద్రబాబును నమ్మలేని పరిస్థితి. చంద్రబాబు కాంగ్రెస్‌ను కూడా కలిశారు. వచ్చే లోక్‌ సభ ఎన్నికలలో గెలిచినా మద్దతు ఇస్తారనుకోవడమూ వృధా ప్రయాసే అని మోదీ, షా ఖచ్చితంగా అంచనా వేస్తారంటున్నారు. అనేక సార్లు చంద్రబాబు తమతో పొత్తు పెట్టుకోవడం, విడిపోవడం మామూలుగా మారింది. చివరకు చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు కూడా పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుతో కలసి వెళ్లినా, నాలుగైదు ఎంపీ స్థానాల కోసం పొత్తు కుదుర్చుకున్నా ఫలితం ఉండదన్న అంచనాకు వారు వచ్చే అవకాశముంటుందన్న వాదన ఢిల్లీ నుంచి వినిపిస్తుంది.
నమ్మకమైన మిత్రుడు...
ఇక నమ్మకమైన స్నేహితుడిగా జగన్‌ను చూడవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే జగన్ కాంగ్రెస్‌కు సహజమైన శత్రువు. తనపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, పదహారు నెలలు జైలులో ఉంచడంతో జగన్ కాంగ్రెస్‌కు ఎట్టిపరిస్థితుల్లో మద్దతివ్వరు. వైసీపీ ఏపీలో కొంత బలంగానే ఉంది. తీసేయదగ్గ స్థితిలో లేదు. ఎన్నికల ముందు పొత్తు లేకపోయినా అనంతరం తనకు మద్దతిస్తారన్న నమ్మకం ఉంది. కాకుంటే జగన్‌కు ఈ ఏడాది పాటు ఆర్థిక వనరులు కొంత సమకూర్చాల్సి ఉంటుంది. అంటే అప్పులు చేయడానికి కొంత వెసులుబాట్లు కల్పించాల్సి ఉంటుంది. అదేమీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పెద్ద కష్టమేమీ కాదన్నది ఢిల్లీ నుంచి వినిపిస్తున్న టాక్.
జగన్‌కు పూర్తి సహకారం....
మరోవైపు ఏపీలో తాము సొంతంగా ఎదగడానికి ప్రయత్నించాలి. జనసేనతో కలసి ఉన్నా, లేకపోయినా తాము ఒంటరిగానే బరిలోకి దిగాలన్నది ఆ పార్టీ పెద్దల ఆలోచనగా ఉంది. తనకు అవసరమైన సమయంలో మద్దతిచ్చి, అవసరం తీరాక మద్దతు ఉపసంహరించుకునే పార్టీలను నమ్మవద్దన్నది ఢిల్లీ పెద్దల ఆలోచనగా ఉంది. పవన్ బీజేపీని వదలి వెళ్లినా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో జగన్ కు రానున్న ఏడాదికాలంలో హస్తిన నుంచి పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి సహకారం లభించే అవకాశాలున్నాయంటున్నారు. చంద్రబాబు కూడా కన్నడ ఫలితాలు చూసి ఇక బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తుండటంతో ఇది జగన్‌కు కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు.


Tags:    

Similar News