ఏవోబీలో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. ఆర్కే ఆచూకీ కోసం బుధవారం కూడా తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు ఎంతగా ‘తమ వద్ద లేడని‘ చెబుతున్నప్పటికీ.. మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, ప్రజాసంఘాల వారు మాత్రం వారివైపే వేలెత్తి చూపిస్తున్నారు. పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారని అంటున్నారు. మరోవైపు ఏవోబీలో కూంబింగ్ ఆపరేషన్‌లను పోలీసులు వెంటనే నిలిపేయాలంటూ మావోలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏవోబీలో, ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
మొత్తం అయిదు రాష్ట్రాల్లో మావోయిస్టులు బంద్ కు పిలుపు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మన్యం గ్రామాల్లో పోస్టర్లు కూడా వెలియడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మల్కన్ గిరి ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో 9 మంది సాధారణ పౌరులని, వారికి మావోయిస్టు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని మావోయిస్టు నాయకుడు జగబంధు ఆరోపించారు. ఎన్‌కౌంటర్ చూసేందుకు వచ్చిన వారిని కూడా పట్టుకుని మట్టుపెట్టారని జగబంధు ఆరోపిస్తున్నారు. ఆ 9 మంది మరణాలకు సంబంధించి ప్రభుత్వం న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్ర, ఒదిశా ప్రభుత్వాల మీద తప్పకుండా ప్రతీకార చర్యలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు. అలాగే కూంబింగ్ ను తక్షణం నిలిపివేయాలంటూ జగబంధు కోరుతున్నారు. మరణించిన వారిలో 9 మంది సాధారణ పౌరులనే మాటే గనుక నిజమైతే.. ఇంకా చాలా పెద్ద రాద్ధాంతంగా మారే ప్రమాదం ఉంది.