హైదరాబాదులోని ఏపీ సచివాలయానికి ఈనెల 31 వ తేదీతో కాలం చెల్లనుంది. ఇక్కడి భవనాలను ఏపీ అధికారులు ఖాళీ చేసి వెలగపూడి వెళ్లిపోయినప్పటికీ.. భవనాలు ఇంకా వారి ఆధీనంలోనే ఉన్నాయి. వాటి మీద విభజన చట్టం ప్రకారం వారికి పదేళ్లపాటు అధికారం ఉంటుంది. అయితే వారు ఆ భవనాలను తక్షణం తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతూ తెలంగాణ కేబినెట్ ఒక తీర్మానం చేసింది. ఆ విషయాన్ని గవర్నర్ నరసింహన్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆయన కూడా పార్టీ పాలిట్ బ్యూరోలో ఇచ్చేద్దాం అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అధికారిక నిర్ణయం జరగలేదు.
ఒకవైపు ఈ భవనాలు వెంటనే కావాలని, తాము కూలగొట్టడం ప్రారంభించాలని తెలంగాణ సర్కారు కోరుతోంది. తాజాగా భవనాల అప్పగింతకు అధికారిక నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబు సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఈనెల 31వ తేదీన చంద్రబాబు కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ కేబినెట్ లో భవనాల అప్పగింత గురించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
అయితే 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకం గురించి తేల్చుకోకుండా.. సచివాలయం ఇచ్చేయడం అనేది మంచి నిర్ణయం కాదని పలువురు వాదిస్తున్నారు.