టెక్నాలజీ ప్రజల జీవితాలను పూర్తిగా మార్చివేసిందని భారత ప్రధాని మోడీ అన్నారు. 1997లో భారత్ జీడీపీ 400 బిలియన్ డాలర్లు మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం భారత్ జీడీపీ ఆరు రెట్లు పెరిగిందన్నారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో మోడీ ప్రసంగించారు. 20 ఏళ్ల తర్వాత భారత ప్రధాని దావోస్ వేదికపై ప్రసంగించడం విశేషం. భారత్ లో పెట్టుబడులకు గల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇరవై ఏళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబమన్నారు. వసుధైక కుటుంబం అనే భావనను భారత్ ఎప్పుడో చాటి చెప్పిందన్నారు. పర్యావరణ మార్పులు భయపెడుతున్నాయన్నారు. మంచుతుఫాన్లురావడం ఇప్పుడే చూస్తున్నామన్నారు. ప్రకృతితో మమైకమయి జీవించడం భారత్ సంస్కృతిలోనే ఉందన్నారు. మన సంతోషాలకోసం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుర్వేదం, యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది భారత్ అని చెప్పారు. సైబర్ టెక్నాలజీ దుర్వినియోగంపై దృష్టిపెట్టామన్నారు.ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా మారిందన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా ఈ సమస్యపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు.