IPL 2026 : బ్యాటర్లు వరసబెట్టి పెవిలియన్ కు.. చెన్నై చెత్త బ్యాటింగ్.. రాజస్థాన్ దే జయం
ఐపీఎల్ 2026 మ్యాచ్ ప్రారంభమయిన తర్వాత మూడో మ్యాచ్ అతి చెత్తగా జరిగింది
ఐపీఎల్ 2026 మ్యాచ్ ప్రారంభమయిన తర్వాత మూడో మ్యాచ్ అతి చెత్తగా జరిగింది. ఏ మాత్రం ఉత్కంఠ లేదు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు వరసబెట్టి అవుట్ కావడంతో అతి తక్కువ పరుగులు స్కోరు చేయగలిగింది. ఏ ఒక్క బ్యాటర్ నిలకడగా ఆడలేకపోవడంతో కేవలం 127 పరుగులు మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ చేసింది. ఇంతటి వైఫల్యాన్ని ఎన్నడూ చూడలేదు. దీంతో తక్కువ లక్ష్యాన్ని అధికగమించడానికి రాజస్థాన్ రాయల్స్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. సోమవారం జరిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు వాతావరణ పరిస్థితులను చక్కగా వినియోగించుకున్నారు. నెమ్మదిగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌ను 127 పరుగులకే కట్టడి చేశారు.
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్...
వర్షం కారణంగా కొంతసేపు పిచ్ కవర్లతో కప్పేసి ఉండటంతో టాస్ గెలిచిన రియాన్ పరాగ్ సీఎస్‌కేను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. గత సీజన్‌లో చివరి స్థానాల్లో నిలిచిన సీఎస్‌కే, రాయల్స్ జట్లు ఈ సీజన్‌కు ముందు తమ స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, సంజు శాంసన్‌లను పరస్పరం మార్చుకున్నాయి. రాయల్స్ తరఫున మళ్లీ బరిలోకి దిగిన జడేజా తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీశారు. టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన శాంసన్ సీఎస్‌కే తరఫున తొలి మ్యాచ్‌లో మెరవలేకపోయాడు. నాంద్రే బర్గర్ బంతిని మిడ్‌వికెట్ మీదుగా కొట్టాలని ప్రయత్నించగా, సీమింగ్ డెలివరీ ఆఫ్ స్టంప్‌ను కొట్టింది.
వరస బెట్టి అవుటవుతూ...
పవర్‌ప్లేలో బర్గర్, జోఫ్రా ఆర్చర్ బంతిని స్వింగ్ చేయించి సీఎస్‌కే బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. బర్గర్ శాంసన్‌ను ఔట్ చేసిన తర్వాత ఆర్చర్ సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను బౌల్డ్ చేశారు. ఆఫ్‌సైడ్‌లో ఎత్తుగా కొట్టే ప్రయత్నంలో ఆయన స్టంప్స్ చెల్లాచెదురయ్యాయి. రెండో ఓవర్లో బర్గర్ హ్యాట్రిక్ అవకాశాన్ని కూడా సృష్టించాడు. అయుష్ మాఠ్రే గ్లవ్స్‌ను తాకిన బౌన్సర్ వికెట్‌కీపర్ చేతికి వెళ్లింది.ఎనిమిదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన జడేజా మరోసారి ప్రభావం చూపించాడు. సర్ఫరాజ్ ఖాన్ 17 పరుగులు చేసి స్లాగ్ స్వీప్ ఆడబోయి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. నాలుగు బంతుల తర్వాత శివం దూబే ఆరు బంతుల్లో లాంగ్ ఆఫ్ దాటించలేక క్యాచ్ ఇచ్చాడు. దీంతో సీఎస్‌కే స్కోరు ఎనిమిది ఓవర్లలో 57 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది.
ఛేదనను అలవోకగా...
ఆ తర్వాత జేమీ ఓవర్టన్ 43 పరుగులతో కొంత పోరాడినా జట్టును కాపాడలేకపోయాడు. రాయల్స్ మిడియం పేసర్ బ్రిజేష్ శర్మ డెబ్యూలో కార్తిక్ శర్మను ఔట్ చేశాడు. ఆర్చర్, బర్గర్, జడేజా తలా రెండు వికెట్లు తీశారు. 128 పరుగుల లక్ష్యాన్ని పెద్దగా కష్టపడకుండానే రాజస్థాన్ రాయల్స్ అధిగమించింది. వైభవ్ సూర్య వంశీ క్యాచ్ ను మిస్ చేయడంతో ఇక రెచ్చిపోయాడు. పదిహేను బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ధ్రువ్ జురేల్ తక్కువ పరుగులకే అవుటయినప్పటికీ యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్ నిలబడి మ్యాచ్ ను గెలిపించారు. పెద్దగా ఆసక్తి లేని మ్యాచ్ లా చెన్నై సూపర్ కింగ్స్ ఆడటం కొంత అభిమానులను నిరాశకు గురిచేసింది.