Summer Effect : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. తర్వాత అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే రేపటి నుంచి ఎండల తీవ్రత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత కొద్ది రోజులుగా అడపా దడపా కురుస్తున్న వానలు ఇక పడకపోవచ్చని, ఈ అకాల వానలు మళ్లీ ఏదైనా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే తప్ప కురవని చెబుతున్నారు.
దంచి కొడుతున్న ఎండలు...
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచి కొడుతున్నాయి. నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అమరావతి వాతావరణ కేంద్రం అధికారుల సూచన మేరకు ఎండల తీవ్రతతో పాటు వేడిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని, వడదెబ్బ కూడా తగిలే అవకాశముందని, అవసరమైతే తప్ప ప్రజలు పగటి వేళల్లో బయటకు రావద్దని హెచ్చరిస్తుంది. అత్యవసర పనుల కోసం రావాలంటే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. లేకుంటే ఇబ్బందులు తప్పవన్నారు. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ అయింది. ప్రకాశం, మార్కాపురం, నంద్యాల,చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
తెలంగాణలోనూ ఎండల తీవ్రత...
తెలంగాణలోనూ ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. గత ఏడాదికి మించిన ఎండల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత వేసవిలో ఎండల తీవ్రత అంతగా లేదు. కానీ ఈ ఏడాది మాత్రం మార్చి నుంచి చుక్కలు కనపడుతున్నాయి. ఎండ వేడిమికి తోడు ఉక్కపోత, వేడిగాలులు ఎక్కువగా వీస్తున్నందున రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని చెబుతున్నారు. పలు చోట్ల తేలిక పాటి వానలు పడతాయని, గంటకు నలబై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.