Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్...భక్తుల రద్దీ సాధారణమే
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గత రెండు రోజుల నుంచి తిరుమలకు భక్తుల రాక కొంత తగ్గింది. రద్దీ తగ్గడంతో స్వామి వారి దర్శనం సులువుగా మారింది. కంపార్ట్ మెంట్లలో పెద్దగా వేచి ఉండకుండానే భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. అయితే తిరిగి శుక్రవారం నుంచి భక్తుల రద్దీ మొదలవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు...
తిరుమలలో రేపటి వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు కొనసాగనున్నాయి. చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేలా టీటీడీ ఉత్సవాలు చేయనున్నది. ఉదయం 8 గంటలకు బంగారు రథంపై మలయప్పస్వామి ఊరేగించనున్నారు. రేపు వసంత మండపానికి ఉత్సవమూర్తులు మలయప్పస్వామి, ఆంజనేయస్వామి, శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తుల వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. తిరుమలలో సాయంత్రం 6 గంటలకు అర్చకులు ఆస్థానం నిర్వహించనున్నారు. పలు ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది.
ఇరవై కంపార్ట్ మెంట్లలో...
నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,044 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,241 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.08 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.