Tiger : పులి ఈ సీజన్ లోనే దూకుడు మీదుంటుందట.. అందుకు కారణాలివే
కొమురంభీం జిల్లాలో పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది.
కొమురంభీం జిల్లాలో పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. జిల్లాలోని ఇటిక్యాలపాడు శివారులో ఇప్పటికే ఒకరిని పులి చంపేయగా, మరొకరిపై దాడి చేసింది. పులి అక్కడే సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులు తేల్చారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోనే ఈ గ్రామం ఉంటుంది. అందుకే మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి జనారణ్యంలోకి వస్తుంది. గ్రామం దాటి ఎవరూ పొలాల్లోకి వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. 144వ సెక్షన్ విధించారు. ఇక ఈ గ్రామానికి ఉపాధ్యాయులు, వైద్యులు కూడా పులి భయంతో గ్రామానికి రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకే పాఠశాలలను బంద్ చేసి వెళ్లిపోతున్నారు.
చదువులు బంద్...
ఇటిక్యాల పాడు గ్రామానికిచెందిన విద్యార్థులు కూడా చదువు కోవడానికి సిర్పూర్ వెళ్లాల్సి ఉంటుంది. అయితే పులి భయంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. పొలాలకే కాదు.. కనీసం చదువులను కూడా పక్కన పెట్టేశారు. ఉదయం పది గంటలు దాటిన తర్వాత మాత్రమే పొలాలకు పది మంది కలసి వెళ్లాలని, ఒక్కరూ వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఒంటరిగా పొలం వెళ్లినా, ఊళ్లకు వెళ్లే ప్రయత్నం చేసినా పులి బారిన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. పులి ఇక్కడే సంచరిస్తుందని, ప్రమాదకరమైన పరిస్థితులున్నాయని, ఎవరూ బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు. తమ పశువులను కూడా ఇళ్లకే పరిమితం చేయాలని సూచిస్తున్నారు.
ఈ సీజన్ లోనే....
శీతాకాలం పులి తోడు కోసం వెతుకులాటలో ఈ ప్రాంతానికి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో పులి దూకుడుగా ఉంటుందని, ఎవరుకనిపించినా దాడికి దిగుతుందని చెబుతున్నారు. మామూలు సమయాల్లో పులి మనుషులను చూసి వెళ్లిపోతుందని, ఇప్పుడు జతను కలిసే టైంలో దానిని ఆపడం ఎవరి తరమూ కాదని చెబుతున్నారు. ఇక పొలాల్లో వంగి కూడా పనులు చేయవద్దని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వంగి పొలం పనులు చేసుకుంటుంటే మనిషిని కూడా జంతువుగా భావించి అది దాడికి దిగుతుందని,అందుకోసం గ్రామస్థులకు మాస్క్ లను పంపిణీ చేస్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాంతంలో పులి భయంతో గ్రామ ప్రజలు బితుకు బితుకుమంటూ బతుకుతున్నారు.