Weather Reprort : బాబూ.. జర జాగ్రత్త.. చలిలో బయటకు వచ్చారో ఇక అంతే?
తెలుగు రాష్ట్రాలు కూడా చలితీవ్రతకు ఇబ్బంది పడుతున్నాయి.
దేశంలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా చలితీవ్రత ఎక్కువగా ఉంది. అందులోనూ ఎప్పుడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాలు కూడా చలితీవ్రతకు ఇబ్బంది పడుతున్నాయి. గడ్డకట్టే పరిస్థితులు నెలకొని ఉండటంతో అందరిలోనూ ఆందోళన ఎక్కువగా ఉంది. రానున్న కాలంలో చలితీవ్రత మరింత ఎక్కువవుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే నెల వరకూ చలిగాలుల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రజలు చలిగాలులతో మరో నెల రోజుల పాటు ఇబ్బందులు పడక తప్పదని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావద్దని చెబుతున్నారు.
అన్ని ప్రాంతాల్లో...
ఆంధ్రప్రదేశ్ లోనూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గత నెలరోజులకు పైగానే చలితీవ్రత ఎక్కువగా ఉంది.ఏజెన్సీ ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ.. నమోదవుతూనే ఉంటాయి. అందులోనూ ఉక్కపోత వాతావరణం ఉండే కోస్తాంధ్ర ప్రాంతంలోనూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. కానీ గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ కూడా చలితీవ్రత ఎక్కువగా ఉంది. మరొకవైపు ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదయ్యే రాయలసీమ జిల్లాల్లోనూ చలిగాలుల తీవ్రత ఎక్కువ కావడం విశేషం. అందుకే ఏపీ అంతటా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.
మూడు నెలల నుంచి...
తెలంగాణలో చలిగాలుల పరిస్థితి ప్రతి సీజన్ లో ఉంటుంది. నవంబరు నెల నుంచి డిసెంబరు వరకూ చలి కొంత అధికంగానే తెలంగాణలో ఉంటుంది. కానీ ఈసారి నవంబర్ నెలలో ప్రారంభమైన చలితీవ్రత ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో మరింత చలి తీవ్రత ఎక్కువయింది. ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పాటు దట్టమైన పొగమంచు కూడా కురుస్తుండటంతో వాహనదారులను ఇబ్బందులు పెడుతుంది.