తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం ఖాయం

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని

Update: 2023-06-06 13:32 GMT

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు రెడీ కావాలని సూచించారు. టీడీపీ అధికారంలో లేకపోయినా తెలంగాణలో కార్యకర్తల ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తోందన్నారు. హైదరాబాద్‌లోని ప్రతి అంగుళాన్ని డెవలప్‌ చేశానన్న సంతృప్తి తనకు ఉందన్నారు. అప్పట్లో ఐటీ రంగం అన్నం పెడుతుందా? అని అందరూ తనని ఎగతాళి చేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో చంద్రబాబుకు సన్మానం జరిగింది.

ఇటీవల జరిగిన మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాసాని జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో చంద్రబాబుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్, పీవీ నరసింహారావు దేశానికి దశ, దిశను చూపించారని, టీడీపీ వచ్చాకే తెలుగు వారి ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు రెడీ కావాలన్నారు. తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ పార్టీ బలోపేతం ఎంతో శ్రమిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.

హైదరాబాద్‌ను ఇంచ్ బై ఇంచ్ డెవలప్‌ చేశానన్న సంతృప్తి తనకు ఉందని, తన తర్వాత వచ్చిన సీఎంలు కూడా అభివృద్ధిని కొనసాగించారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని చెబుతున్నారని, దానికి టీడీపీ వేసిన పునాది కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర అభివృద్ధిని ఆపేసి విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం టీడీపీ నిరంతరం శ్రమిస్తోందన్నారు. తెలుగు దేశం పార్టీ తెలంగాణ గడ్డపైనే పుట్టిందని, ఈ విషయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం, టీటీడీపీ కమిటీలు పూర్తిచేయటం అభి‌నందనీయమని, తెలుగు ప్రజలకు రుణపడి ఉంటానని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News