Telangana : రాజ్యసభ సభ్యులు ఇద్దరూ ఏకగ్రీవ ఎన్నిక

రాజ్యసభ ఎన్నికలలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు

Update: 2026-03-09 11:51 GMT

రాజ్యసభ ఎన్నికలలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తెలంగాణ నుంచి మూడు నామినేషన్‌లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్‌ సింఘ్వీ మూడుసెట్ల నామినేషన్‌ వేశారు. మరో కాంగ్రెస్ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి నాలుగు సెట్ల నామినేషన్‌ వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక సెట్ నామినేషన్ వేశారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి పది మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా వేశారు. దీంతో ఆయన నామనేషన్ ను ఎన్నికల అధికారి తిరస్కరించారు.

ఇద్దరికీ ధ్రువీకరణ పత్రాలు...
దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అభిషేక్ మనుసింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధికారులు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ఎన్నికల అధికారులు వారికి ఎన్నికయినట్లు అధికారిక దృవీకరణ పత్రాన్ని కూడా అందచేశారు. దానిని అందుకున్న వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని చెప్పారు. అలాగే తనకు సహకరించిన పార్టీలో ఉన్న అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వాణిని రాజ్యసభలో వినిపిస్తానని చెప్పారు.


Tags:    

Similar News